Share News

పొగాకు, మద్యం, షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:09 AM

జువైనల్‌ జస్టిస్‌ మోడల్‌ రూల్స్‌ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

 పొగాకు, మద్యం, షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు

  • హైకోర్టులో పిల్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

  • కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశం

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జువైనల్‌ జస్టిస్‌ మోడల్‌ రూల్స్‌ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్త్రీ శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, హోం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పురపాలక, పాఠశాల విద్యశాఖల ముఖ్యకార్యదర్శులు, జువైనల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌, రాష్ట్ర డీజీపీ, ఆరోగ్యశాఖ కమిషనర్‌, తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. హెల్ప్‌ ది పీపుల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌/ మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించేవారికి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించబడుతుందని బోర్డులపై స్పష్టంగా పేర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపించారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 ప్రకారం విద్యా సంస్థలకు 100గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయించడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపినందుకు 2025-26లో 35,449 కేసులు నమోదయ్యాయని వివరించారు. చట్టం అమలు పర్యవేక్షణకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ క్రమం తప్పకుండా సమావేశం కావాల్సి ఉండగా, 2022 జనవరిలో మాత్రమే చివరి సమావేశం జరిగిందని తెలిపారు. దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 06:09 AM