Share News

ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోండి!

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:51 AM

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలలను ఆప్షన్‌గా నమోదు చేసుకోవాలని హెల్త్‌ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ సూచించారు. మంగళవారం హెల్త్‌ వర్సిటీలో వారు మీడియాతో మాట్లాడారు.

ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోండి!

  • వైద్య విద్యార్థులకు హెల్త్‌ వర్సిటీ సూచన

  • 39 కాలేజీలకూ ఆప్షన్లు పెడితే మంచిది

  • 11 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

  • 15 నుంచి ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు

  • వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలలను ఆప్షన్‌గా నమోదు చేసుకోవాలని హెల్త్‌ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ సూచించారు. మంగళవారం హెల్త్‌ వర్సిటీలో వారు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఆప్షన్లు పెట్టుకోవడం వల్ల ఓపెన్‌ కేటగిరిలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవడం వల్ల సీటు పోందే అవకాశాలు మెరుగవుతాయని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి తొలిదశ కౌన్సెలింగ్‌ పూర్తయిందని, మొత్తం 4,581 సీట్లలో 4,321 సీట్లు కేటాయించామని చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థుల్లో 90 మంది మినహా మిగిలిన వారు కాలేజీల్లో చేరారని, ప్రస్తుతం జాతీయస్థాయిలో రెండో విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతోందని తెలిపారు. జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ పూర్తి అయిన వెంటనే ఈ నెల 11 నుంచి రాష్ట్రంలో రెండో విడత కౌన్సిలింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెండో దశలో కూడా అభ్యర్థులు ఆప్షన్లు పెట్టుకునే వెసులుబాటు కల్పించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో కలిపి 39 మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో కొందరు అభ్యర్థులకు వారి ర్యాంకులకు అనుగుణంగా కళాశాలలు దక్కలేదన్న ప్రచారంలో వాస్తవం లేదని.. అభ్యర్థుల ర్యాంకులు, అందుబాటులో ఉన్న సీట్లు, వారు పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.


2025-26 కౌన్సెలింగ్‌లో ఎదురైన సమస్యల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు వివరించారు. ఈ నెల 15 నుంచి ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రారంభమైన తర్వాత కూడా జాతీయ వైద్య కమిషన్‌ నుంచి కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల పునరద్ధురణ, సీట్ల పెంపునకు అనుమతులు వచ్చాయని, దీంతో తదుపరి దశల్లో అదనపు సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వీటితో పాటు మెడికల్‌ కాలేజీలు, ఆయుష్‌, నర్సింగ్‌ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యా ప్రణాళిక, అకడమిక్‌ కార్యకలాపాలు, పరిశోధన రంగాల్లో జరుగుతున్న తాజా అభివృద్ధిపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఇటీవల జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలోని సవరణకు సంబంధించిన సందేహాలు, అపోహలు, తప్పుడు అవగాహనలను నివృత్తి చేయనున్నట్టు వివరించారు.

మన కాలేజీలకు ర్యాంకులు

రాష్ట్రంలో వైద్య విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు చేపడుతున్నామని వీసీ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌, ఎన్‌ఏఏసీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలు మెరుగైన ప్రతిభ కనబరిచాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ జాతీయస్థాయిలో మూడో స్థానం, రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిందన్నారు. ఆరు కాలేజీలు ఉత్తమ ర్యాంకులు సాధించాయన్నారు.

ఏఐ, ఎల్‌ఎంఎస్‌తో వైద్య విద్య విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు వర్సిటీలో లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఎల్‌ఎంఎస్‌), ఏఐ ఆధారిత విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు వీసీ తెలిపారు. తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ సీట్లను ప్రారంభిస్తున్నామన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

పడక గది ప్రశాంతంగా...

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

Updated Date - Sep 09 , 2026 | 04:51 AM