జూట్‌మిల్లు కార్మికులకు బకాయిల చెల్లింపు
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:56 PM
తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలో ఉన్న ఉమా జూట్ ట్వైన్ మిల్స్ యాజమాన్యం 2026 మార్చి వరకు పదవీ విరమణచేసిన, చనిపోయిన 33 మంది కార్మికులకు చెల్లించాల్సిన రూ.52లక్షల 86వేల గ్రాట్యూటీ బకాయిలను చెల్లించిందని ఆ మిల్లు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా తెలిపారు.
కొత్తవలస, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలో ఉన్న ఉమా జూట్ ట్వైన్ మిల్స్ యాజమాన్యం 2026 మార్చి వరకు పదవీ విరమణచేసిన, చనిపోయిన 33 మంది కార్మికులకు చెల్లించాల్సిన రూ.52లక్షల 86వేల గ్రాట్యూటీ బకాయిలను చెల్లించిందని ఆ మిల్లు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా తెలిపారు. మంగళవారం ఆయన కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఈస్టుకోస్టు, అరుణ, గోపాలకృష్ణ ఏపీ ఫైబర్స్, జ్యోతి, నవ్య మొదలైన పరిశ్రమలలో కార్మికులకు గ్రాట్యూటీ బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటికే ఈ మిల్లులో కార్మికులకు వందలకోట్ల రూపాయల గ్రాట్యూటీ బకాయిలు ఉన్నాయన్నారు. తమ నాయకత్వంలోని కొత్తవలస ఉమాజూట్ మిల్లు కార్మికులకు ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించే విధంగా యాజమాన్యంతో చర్చలు జరిపి న్యాయం చేస్తుందని తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ.కోటి 38లక్షల పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలను చెల్లించారని చెప్పారు. పదవీ విరమణ చేసిన, చనిపోయిన కార్మికులకు ఎటువంటి బకాయిలు లేకుండా యాజమాన్యం చెల్లింపులు చేసిందన్నారు. ఈ మేరకు కార్మికుల తరపున యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు కర్తు శ్రీను, కె.ఈశ్వరరావు, ఎస్.గోవింద, ఎస్.రాంబాబు పాల్గొన్నారు.