Share News

రాష్ట్రానికి హెచ్‌డీ హ్యుందాయ్‌ షిప్‌యార్డు!

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:14 AM

ప్రపంచంలోనే అతిపెద్ద షిప్‌బిల్డింగ్‌ కంపెనీ హెచ్‌డీ హ్యుందాయ్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలతో దక్షిణ కొరియాకు చెందిన ఆ కంపెనీ రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపింది.

రాష్ట్రానికి హెచ్‌డీ హ్యుందాయ్‌ షిప్‌యార్డు!

  • కాకినాడ సెజ్‌లో ఏర్పాటుకు ప్రభుత్వానికి దక్షిణ కొరియా కంపెనీ ప్రతిపాదనలు

  • 38 వేల కోట్ల పెట్టుబడి.. 90 వేల ఉద్యోగాలు

  • తమిళనాడు నుంచి ఏపీ వైపు మరలిన దృష్టి

  • 2 నెలల క్రితం కొరియా పర్యటనలో యాజమాన్యంతో లోకేశ్‌ చర్చలు

  • పారిశ్రామిక విధానం, మెరుగైన ప్రోత్సాహకాలను వివరించిన మంత్రి

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతిపెద్ద షిప్‌బిల్డింగ్‌ కంపెనీ హెచ్‌డీ హ్యుందాయ్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలతో దక్షిణ కొరియాకు చెందిన ఆ కంపెనీ రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపింది. పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం దూకుడుగా వేస్తున్న అడుగులు, పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న మెరుగైన రాయితీలు ఆ కంపెనీని రాష్ట్రానికి వచ్చేలా చేశాయి. కాకినాడ సెజ్‌లో మెగా షిప్‌యార్డు ఏర్పాటు చేసేందుకు హెచ్‌డీ హ్యుందాయ్‌ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. తొలుత తమిళనాడులోని తూత్తుకుడిలో షిప్‌యార్డు నిర్మించాలనుకున్న ఈ కంపెనీ.. మంత్రి లోకేశ్‌ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ వైపు దృష్టి సారించింది. ఏపీ ప్రభుత్వం చేసిన స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పారిశ్రామిక విధానం, మెరుగైన పెట్టుబడుల ప్రోత్సాహకాల ప్రతిపాదనలతో ఏపీలో షిప్‌యార్డ్‌ నిర్మాణానికి మొగ్గు చూపింది. రూ.38 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడ సెజ్‌లో షిప్‌యార్డు స్థాపనకు ప్రతిపాదించింది. ఇది అమల్లోకొస్తే ప్రత్యక్షంగా సుమారు 15వేలు, పరోక్షంగా 75 వేల మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది. మంత్రి లోకేశ్‌ రెండు నెలల క్రితం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో భాగంగా హెచ్‌డీ హ్యుందాయ్‌ కంపెనీ యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరిపారు. అప్పటికే తమిళనాడులోని తూత్తుకుడిలో షిప్‌యార్డును స్థాపించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ విషయంలో అంతకుముందే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. దీనికి స్టాలిన్‌ ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది.


హ్యుందాయ్‌ యాజమాన్యంతో జరిపిన చర్చల్లో ఏపీలోని తూర్పు తీర ప్రాంతమైన కాకినాడలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డు నిర్మాణం ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానం చేస్తుందని మంత్రి లోకేశ్‌ వివరించారు. ఏపీలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహకాల అమలు గురించి వివరించారు. కాకినాడ సెజ్‌లో షిప్‌యార్డును నిర్మించాలనే ప్రతిపాదనను హ్యుందాయ్‌ సంస్థ ముందుంచారు. ఆ సమయంలో తాము ఇప్పటికే తమిళనాడులో షిప్‌యార్డు స్థాపన ఆలోచనలో ఉన్నందున.. ఏపీ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హ్యుందాయ్‌ ప్రతినిధులు వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత విజయ్‌ ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహకాల విషయంలో పొరుగు రాష్ట్రం ఏపీతో పోటీ పడేలా పారిశ్రామిక రాయితీలను అమలు చేయడం లేదని, దీంతో తూత్తుకుడిలో ఏర్పాటు కావాల్సిన షిప్‌యార్డును కాకినాడకు తరలించే ఆలోచనలో హ్యుందాయ్‌ కంపెనీ ఉందని తమిళ తంబీలు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్

వైసీపీ కీలక నేత అరెస్ట్.. పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన ఆ పార్టీ శ్రేణులు

Updated Date - Sep 05 , 2026 | 04:14 AM