Share News

గురుకులాల ప్రగతి బాట!

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:00 AM

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గురుకులాల్లో విద్యతోపాటు ఆరోగ్యం, ఏఐ ఆధారిత భద్రత, క్రీడలు, సాంకేతిక, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాన్నిస్తున్నాయి.

గురుకులాల ప్రగతి బాట!

  • విద్య, ఆరోగ్యం, ఏఐ ఆధారిత భద్రతపై దృష్టి

  • చదువుల్లో దూకుడు... పెరిగిన ఉత్తీర్ణత శాతం

  • విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ప్రత్యేక శిక్షణపై దృష్టి

  • 1.05 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ

  • మరుగుదొడ్లు, ఇతర పనులకు భారీగా నిధులు

  • రెండేళ్లలో కీలక సంస్కరణలు.. మంచి ఫలితాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గురుకులాల్లో విద్యతోపాటు ఆరోగ్యం, ఏఐ ఆధారిత భద్రత, క్రీడలు, సాంకేతిక, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు ఇప్పటివరకూ ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా ఉన్న ప్రసన్న వెంకటేశ్‌ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు వాటి సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేశారు. ఎంపిక చేసిన గురుకులాల్లో ఏఐ ఆధారిత సీసీ టీవీ అనలిటిక్స్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటుచేశారు. అనుమతి లేకుండా ప్రవేశం, గేట్ల వద్ద అనుమానస్పద సంచారం, పారిశుధ్య సమస్యలపై రియల్‌టైం అలెర్ట్‌లు వచ్చేలా వ్యవస్థను రూపొందించారు.


ఫలితాల్లో మెరుగుదల...

2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 89.48 శాతం, ఇంటర్‌ రెండో సంవత్సరంలో 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల అనంతరం పదో తరగతి ఉత్తీర్ణత 98.86 శాతానికి, ఇంటర్‌ ఉత్తీర్ణత 96.80 శాతానికి చేరింది. ఆన్‌లైన్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ మాడ్యూల్‌ ద్వారా విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఐఐటీ, నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. 2024-25లో 55 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, సీఫ్‌టీఐ, ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు. 2025-26లో 75 మంది ఎంపిక/కౌన్సిలింగ్‌లో ఉండగా.. 116 మంది ఆర్‌జీయూకేటీ (ఐఐఐటీ)లో సీట్లు సాధించారు. గురుకులాల విద్యార్థుల కోసం కొత్తగా ఏడు జేఈఈ/నీట్‌ కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి సుమారు 1440 మందికి శిక్షణ అందిస్తున్నారు. కాగా... ఐఏఎస్‌, ఐపీఎస్‌, వైద్య, ఇంజనీరింగ్‌... తదితర రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో పక్షం రోజులకోసారి మెంటార్‌షిప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 189 సంస్థల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కెరీర్‌ గైడెన్స్‌, పోటీ పరీక్షలపై మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటికే 20 వేల మంది ఈ ప్రయోజనం పొందారు.


ఆరోగ్యంపై పర్యవేక్షణ..

హెల్త్‌ మానిటరింగ్‌ యాప్‌ ద్వారా సుమారు 1.05 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం రూ.5 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌, యూనిసెఫ్‌ సహకారంతో ప్రాజెక్ట్‌ భీమ్‌ కింద 14 వేల మందికి పైగా విద్యార్థులు, 900 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించారు. గురుకులాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 884 మరుగుదొడ్ల పనులకు రూ.27.30 కోట్లు కేటాయించారు. చిన్నచిన్న మరమ్మతులకు రూ.7.81 కోట్లు, మూలధన పనులకు సాస్కీ కింద మరో రూ.39 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయగా... మరో 49 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.

172 గురుకులాల్లో నెట్‌-జీరో...

ఎన్టీఆర్‌ జిల్లా కుంటముక్కలలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో సీఎస్ఆర్‌ సహకారంతో నెట్‌-జీరో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలను రాష్ట్రంలోని 172 సాంఘిక సంక్షేమ గురుకులాలకు విస్తరించారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘ఫ్యూర్‌ ఆన్‌ మెగా సైన్స్‌ ఫెయిర్‌’ను పునరుద్దరించి రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో నిర్వహించారు. విద్యార్థులు ఇన్‌స్పైర్‌ అవార్డులు, నీతి ఆయోగ్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌, జాతీయ స్థాయి సైన్స్‌, ఇన్నోవేషన్‌ పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర, జోనల్‌ స్థాయి క్రీడా పోటీలను కూడా పునరుద్ధరించారు.

ఈ వార్తలను కూడా చదవండి

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?

ఉపాధ్యాయుల సేవలు అమూల్యం

Updated Date - Sep 06 , 2026 | 05:00 AM