Share News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒక ఉద్యోగిని తొలగించలేదు: మంత్రి కొండపల్లి

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:55 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని ఎంఎస్ఎంఈ, ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఎంఎస్ 1లో జరిగిన రెండో పేలుడు వల్ల 8 మంది కార్మికులు మృతి చెందారని చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒక ఉద్యోగిని తొలగించలేదు: మంత్రి కొండపల్లి
AP Minister Kondapally Srinivas

అమరావతి, జూన్10: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని ఎంఎస్ఎంఈ, ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాజధాని అమరావతిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్ఎంఎస్ 1లో జరిగిన రెండో పేలుడు వల్ల 8 మంది కార్మికులు మృతి చెందారని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ ఘటనా స్థలానికి వెళ్ళి పర్యవేక్షించారని గుర్తు చేశారు.


ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించి.. వారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ధైర్యం నింపారన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు ఉమ్మడి కమిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేశాయని చెప్పారు. మృతి చెందిన పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.2 కోట్ల వరకు ఆర్థిక ప్యాకేజీ అందుతుందని వివరించారు. బాధిత కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగంతో పాటు పిల్లల ఉచిత చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.


కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా రూ.కోటి వరకు నష్టపరిహారం అందజేస్తామని మంత్రి కొండపల్లి చెప్పారు. బాధిత కుటుంబాలు ప్లాంట్ క్వార్టర్స్‌లోనే శాశ్వతంగా నివసించేలా వసతి కల్పిస్తామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'శవ రాజకీయం' చేయడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దంటూ ప్రజలకు మంత్రి కొండపల్లి సూచించారు.


కేంద్రం ఇచ్చిన రూ.11,440 కోట్ల నిధులపై లెక్కలన్ని పక్కాగా ఉన్నాయని.. ఒక్క రూపాయి కూడా మళ్లించలేదని కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రా మెటీరియల్‌కు రూ.4 వేల కోట్లు, ప్లాంట్ అప్‌గ్రేడేషన్‌కే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. వైఎస్ జగన్ హయాంలో 30 శాతానికి పడిపోయిన ప్లాంట్ ఉత్పత్తి.. నేడు 95 శాతానికి పెంచామని గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు 6 లక్షల టన్నుల మార్క్‌ను దాటి విశాఖ ఉక్కు సంస్థ ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోతే కేవలం ముగ్గురికే రూ. కోటి ఇచ్చారని విమర్శించారు. నాడు బాధితులకు ఇచ్చింది కంపెనీ సొమ్మే కానీ, వైసీపీ ప్రభుత్వం సొంతంగా ఇచ్చింది కాదని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కట్టిస్తామన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైందో చెప్పాలని వైఎస్ జగన్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. నాడు విమానాశ్రయంలో మీటింగులు పెట్టిన వైఎస్ జగన్.. నేడు ప్రజల వద్దకు మంత్రులు వెళ్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.


గత ఐదేళ్లలో 'పోస్కో' కంపెనీతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసింది నిజం కాదా? అని మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మంత్రి కొండపల్లి సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చొరవతోనే కేంద్రం రూ. 500 కోట్లు ఇచ్చి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందని గుర్తు చేశారు. బాధిత కుటుంబాల ఓదార్పులోనూ ఓట్ల రాజకీయం చేయడం 'గొడ్డలి పార్టీ' నైజానికి నిదర్శనమంటూ వైసీపీ నేతల తీరును మంత్రి కొండపల్లి ఎండగట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హత్య కేసులో 13 మంది నిందితులకు జీవిత ఖైదు

రాజధాని అమరావతికి కేంద్రం భారీ శుభవార్త: కేంద్ర మంత్రి పెమ్మసాని

For More AP News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 05:36 PM