ప్రాజెక్టు ప్రారంభం కాదు.. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:50 AM
కరువు కారణంగా జరిగే వలసలకు శాశ్వత పరిష్కారం చూపే జీవనరేఖ వెలిగొండ ప్రాజెక్టు అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. నిర్వాసిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు.
అమరావతి, ఆగస్టు31: వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తున్న ప్రాజెక్టు వెలిగొండ అని అన్నారు. సాగునీరు, తాగునీరు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి వెలిగొండ కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. వెలిగొండ ప్రారంభోత్సవం కేవలం ఒక ప్రాజెక్టు ప్రారంభం కాదు.. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
సోమవారం రాజధాని అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేశారని తెలిపారు. 1996లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు జాతికి అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారనేందుకు వెలిగొండ నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర ప్రాజెక్టు ఇది అని తెలిపారు.
కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీటి భరోసా కల్పించే ప్రాజెక్టు ఇదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల రైతులకు వెలిగొండ వర ప్రదాయిని అని వివరించారు. కృష్ణా వరద జలాలను కరువు నేలకు మళ్లించడం ద్వారా రైతుల పొలాలకు జీవం పోస్తున్నామని అన్నారు. వెలిగొండతో చెరువులు నిండుతాయని.. భూగర్భ జలాలు పెరుగుతాయని.. వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
కరువు కారణంగా జరిగే వలసలకు శాశ్వత పరిష్కారం చూపే జీవనరేఖ వెలిగొండ ప్రాజెక్టు అని ఆయన చెప్పారు. నిర్వాసిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. 48 రోజుల్లోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.762 కోట్ల పరిహారం అందించడం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అపర భగీరథుడు సీఎం చంద్రబాబు: అనిత
కరవు నేలకు కృష్ణా జలాలు తెచ్చిన అపర భగీరథుడు సీఎం చంద్రబాబు నాయుడు అని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నంలో తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం.. సీఎం చంద్రబాబు సంకల్పానికి నిదర్శనమని అన్నారు. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ కల సాకారం అవుతోందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంతాల్లో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ఉత్తరాంధ్ర రైతులకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్య
ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురి మృతి
For More AP News And Telugu News