Share News

‘నిజం గెలిచింది’.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ర్యాలీలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 08:38 PM

‘నిజం గెలిచింది’ అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును గతంలో నిర్బంధించిన రోజులను గుర్తుచేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు.

‘నిజం గెలిచింది’.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ర్యాలీలు
Nijam Gelichindi TDP Rally

అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించారు. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కుట్రపూరితంగా 53 రోజుల పాటు నిర్బంధించిన చీకటి రోజులకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీలు చేపట్టారు. నాటి ఘటనకు నిరసనగా టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ 53 కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుపై జగన్ తప్పుడు కేసులు పెట్టించి 53 రోజులు జైలులో నిర్బంధించారని ఆమె ఆరోపించారు. కోర్టులు ఆ కేసులను కొట్టివేయడంతో చంద్రబాబు నిర్దోషిగా బయటపడ్డారని అన్నారు. జగన్ కక్షసాధింపు రాజకీయాలకు ప్రజలు సమాధి కట్టారని, సీఎం చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన కొనసాగిస్తున్నారని సవిత పేర్కొన్నారు.

ATP (1).jpg


బ్లాక్ డే

ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరులో టీడీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూటమి శ్రేణులు బ్లాక్ డే నిర్వహించారు. తిరువూరు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ‘నిజం గెలిచింది.. నిజమే గెలిచింది’ అంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో నిర్బంధించడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ‘నిజం గెలిచింది’ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

RJMN.jpg


53 రోజుల నిర్బంధాన్ని జయించిన నేత

అనంతపురంలో ‘నిజం గెలిచింది’ అంటూ టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. 53 రోజుల నిర్బంధాన్ని జయించిన నేత అంటూ ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాలతో నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. కడప నగరంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరి ప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, ప్రమిదలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మూడేళ్ల క్రితం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు ఈ ర్యాలీ చేపట్టారు.

ATP 3.jpg


గుంటూరు జిల్లా పెదకాకానిలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, 53 కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. నంద్యాలలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు.

ATP 2.jpg

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథులుగా పాల్గొని కొవ్వొత్తులు వెలిగించారు. కుట్రలు విఫలమై చివరికి నిజమే గెలిచిందని వారు పేర్కొన్నారు. అనకాపల్లిలో ‘జయహో బీసీ’ సభలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 53 దీపాలతో సంఘీభావం తెలిపారు. ‘నిజం గెలిచింది’ కాబట్టే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ వచ్చిందని ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు.


Also Read:

నిజం కోసం నిలబడితే.. నిజమే మనల్ని నిలబెడుతుంది: సీఎం చంద్రబాబు

మా నేతలను విమర్శిస్తే ఊరుకోం.. అనిల్‌కు కోటంరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Updated Date - Sep 09 , 2026 | 09:05 PM