CRDAతో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒప్పందం
ABN , Publish Date - Jan 28 , 2026 | 08:14 PM
ప్రజా రాజధాని అమరావతి కార్పొరేట్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. దేశంలో అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఏపీ సీఆర్‌డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకమైన ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA)తో కంపెనీ ప్రతినిధులు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థగా పేరొందిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనుంది. ఈ కార్యాలయ స్థాపన ద్వారా అమరావతిలో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రాంతీయ కార్యాలయం ద్వారా టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో 200 నుంచి 225 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఏఐ స్పెషలిస్ట్ అధికారులు కూడా ఈ కార్యాలయంలో నియమించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
గ్రామీణ, పట్టణ, కార్పొరేట్ రంగాలతో పాటు సాధారణ ప్రజలకు అవసరమైన అన్ని రకాల నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను ఈ ప్రాంతీయ కార్యాలయం ద్వారా అందించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను NIACL తరఫున చీఫ్ రీజినల్ మేనేజర్ వి. రాజాకు CRDA అధికారులు అందజేశారు. అమరావతిలో కార్పొరేట్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పరిణామం రాజధాని అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
Also Read:
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ
For More Latest News