Share News

ఎన్డీఏ నేతల భేటీ.. రాజ్యసభ సీట్ల ఖరారు

ABN , Publish Date - Jun 04 , 2026 | 08:23 PM

రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కూటమిలోని పార్టీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం అగ్రనేతలు సమావేశమయ్యారు.

ఎన్డీఏ నేతల భేటీ.. రాజ్యసభ సీట్ల ఖరారు

అమరావతి, జూన్04: రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కూటమిలోని పార్టీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ 3, జనసేన పార్టీ ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం ఆయా పార్టీల నేతలు విలేకర్లతో మాట్లాడారు.


ప్రచార షెడ్యూల్ త్వరలో విడుదల.. పల్లా శ్రీనివాసరావు

నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ-3, జనసేన-1 తీసుకోవాలని నిర్ణయించామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. 9వ తేదీన తిరుపతి, 12వ తేదీని అమరావతి, 15వ తేదీన విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తిరుపతిలో సంక్షేమం, అమరావతిలో సుపరిపాలన, విశాఖపట్నంలో అభివృద్ధి అంశాలపై బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 13, 16, 17,18,19, 20 వరకు జిల్లాల్లో రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై నిర్వహించే ప్రచార షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. అలాగే ఎస్‌ఐఆర్‌పై ఈ సమావేశంలో చర్చించామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.


రాజ్యసభ అభ్యర్థిని పవన్ ప్రకటిస్తారు: మంత్రి నాదెండ్ల

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు. 24 నెలల పాలనలో చేపట్టిన 24 ప్రధాన కార్యక్రమాలతోపాటు పథకాలపై ప్రచారం చేస్తామని వివరించారు. ఈ కార్యాచరణ ద్వారా ప్రజల ఆశీస్సులను మరోసారి కోరతామన్నారు. జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటిస్తారన్నారు.


జూన్ 9 నుంచి కార్యచరణ.. ఏపీ బీజేపీ చీఫ్..

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన, ప్రధాని 12 ఏళ్ల పాలన వల్ల ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దేశంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన మార్పులను ఈ ప్రచార సభల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. జూన్ 9వ తేదీ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి కార్యాచరణను అమలు చేయాలని తమకు సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణాలు, విశాఖ రైల్వే జోన్ వంటి అనేక అంశాలపై ప్రజల్లోకి వెళ్తామన్నారు.


హడావుడి, ఆర్బాటం లేకుండా సభలు నిర్వహించనున్నామని ఏపీ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు. టీడీపీ - జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్లేనని చెప్పారు. ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉండడం కొందరికి కంటగింపుగా మారిందంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. కొందరు స్వయం ప్రకటిత మేథావులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మే కలిసే ఉంటాం.. ఒక్కటిగా ఉంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.

Updated Date - Jun 04 , 2026 | 08:40 PM