ముగిసిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం.. డీలిమిటేషన్‌కు మద్దతు..
ABN , Publish Date - Apr 15 , 2026 | 09:13 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కలిసికట్టుగా మద్దతు తెలిపేందుకు రావాలని వైసీపీ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని కూటమి నేతలు నిర్ణయించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం ముగిసింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు కలిసికట్టుగా మద్దతు తెలిపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈనెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అమరావతి వేదికగా మహిళా బిల్లును ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే వైసీపీ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని కూటమి నేతలు నిర్ణయించారు. ప్రజా ప్రతినిధులతోపాటు మహిళా ప్రముఖుల్ని ఈ వేడుకకు ఆహ్వానించాలని నేతలు తీర్మానించారు. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన వెంటనే అక్కడే మద్దతు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పరిణామాలపై కూటమి నేతల మధ్య దాదాపు రెండున్నర గంటలకు పైగా కీలక చర్చలు సాగాయి. పార్లమెంట్ ముందుకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వివిధ పార్టీలు లేవనెత్తిన సందేహాలపైనా చర్చ జరిగింది.
దక్షిణాది రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు లేదని కొన్ని పార్టీలు చేస్తున్న వాదనలపైనా కేంద్ర పెద్దల నుంచి స్పష్టత తీసుకున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సహా మరికొందరితో మాట్లాడి బిల్లుపై వివరణ అడిగారు. జనాభాతో సంబంధం లేకుండా దక్షిణాదికి రాజకీయంగా నష్టం లేకుండానే బిల్లు రూపొందిందని కేంద్ర పెద్దల నుంచి స్పష్టత తీసుకున్నారు. ప్రోరేటా ప్రకారమే సీట్ల సంఖ్య పెరుగుతుందని సీఎం చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజ్ చెప్పారు. వారిచ్చిన వివరణపై సీఎం చంద్రబాబు సహా పవన్, మాధవ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
50 శాతం నియోజకవర్గాల సీట్ల పెంపుపై దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదని, దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కొన్ని పార్టీలు దీనిపై చేసేది అనవసర దుష్ప్రచారమని నిర్ధారించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా నేతలు కూలంకషంగా చర్చించారు. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ భారీఎత్తున కార్యక్రమాలు చేపట్టి మహిళలు, ప్రధానికి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించారు. బిల్లు పెట్టే రోజు అన్ని నియోజకవర్గాల్లోనూ లైవ్ స్ట్రీమింగ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వైసీపీ నేత గిరీశ్ కుమార్ రెడ్డి అరెస్టు..
పోలీసులను ఎలా వాడుకున్నారో గుర్తు లేదా సజ్జల?: ఎమ్మెల్సీ కంచర్ల