Share News

ఉపాధ్యాయ నియామకాల్లో గొడ్డలి రాజకీయాలు చేస్తున్న జగన్ : టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:01 PM

పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కూడా వైఎస్ జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

ఉపాధ్యాయ నియామకాల్లో  గొడ్డలి రాజకీయాలు చేస్తున్న జగన్ : టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్
TDP MLC Bhumireddy Ramgopal Reddy

అమరావతి, జూన్11: పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో కూడా వైఎస్ జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. గురువారం రాజధాని అమరావతిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సాగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఆరోపణను ఆధారాలతో సహా నిరూపిస్తుంటే.. జగన్ కళ్లున్నా చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. వైసీపీ ముఠా కంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులే నయమని.. వారి కంటే దారుణంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ నేతలకు ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్’ అంటే ఏమిటో కూడా కనీస అవగాహన లేదని టీడీపీ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. వైసీపీ తమ రాజకీయ విద్రోహ కార్యకలాపాల కోసం నిరుద్యోగ యువతను వాడుకుంటోందని విమర్శించారు. గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన (15-09-2025) అభ్యంతరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డీఎస్సీ 'ఫైనల్ సెలక్షన్ లిస్ట్' విడుదల చేశామని గుర్తు చేశారు. ఎస్‌సీఈఆర్టీ (SCERT) నిపుణుల ప్రత్యేక భద్రత నడుమ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని వివరించారు. సమాచార వ్యవస్థ లేని రోజుల్లో ఆఫీసుల వద్ద రిజల్ట్స్ నోట్స్ పెట్టే వారని.. కానీ నేడు అంతా ఆన్‌లైన్‌లో స్పష్టంగా ఉందన్నారు.


వైసీపీ హయాంలో దొంగ సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి వివరించారు. ఇంటర్ కాలేజియేట్ క్రికెట్ పోటీల్లో కేవలం పాల్గొన్న వారికి దొంగ సర్టిఫికెట్లతో సచివాలయ ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడ గురించి తెలియకుండా వైఎస్ జగన్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగాల్లో క్రీడాకారులకు న్యాయం చేశానని జగన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.


కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఆమోదించిన 65 ఆటల జాబితానే పోర్టల్‌లో ఉంచామని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి వివరించారు. అందులో కూటమి ప్రభుత్వం సొంతంగా చేర్చిన ఆట ఒక్కటి కూడా లేదన్నారు. యాదయ్య అనే క్రీడాకారుడు సరైన సర్టిఫికెట్స్ సమర్పించ లేదు.. ఆ విషయమే అతడు గ్రీవెన్స్‌లో కూడా ఒప్పుకున్నారని వివరించారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న బొంత రోశయ్య అనే వ్యక్తిపై ఫోన్ నెంబర్‌తో సహా ఎఫ్ఐఆర్ నమోదైందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలిపారు.


వ్యవస్థలను మేనేజ్ చేసే వైఎస్ జగన్‌కు..7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారనే కనీస చట్ట పరిజ్ఞానం కూడా లేదా? అంటూ వైసీపీ అధినేతను ఆయన ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి.. నేడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాననడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన డీఎస్సీ స్కామ్‌పై చర్చించే దమ్ము వైఎస్ జగన్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. కూనా రవికుమార్, భరత్‌లపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని మొన్ననే వైసీపీకి ఛాలెంజ్ చేశామని గుర్తు చేశారు. దమ్ముంటే ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పనిచేయని సీఎంకు ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు?: హరీశ్ రావు

వైసీసీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మేసేవారు: పల్లా శ్రీనివాసరావు

For More AP News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 06:02 PM