Share News

ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులు వేగవంతం: మంత్రి నారాయణ

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:32 AM

రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకేచోట ఉండేలా సెక్రటేరియట్‌కు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.

ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులు వేగవంతం: మంత్రి నారాయణ
AP Minister P Narayana

అమరావతి, మార్చి 25: రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకేచోట ఉండేలా సెక్రటేరియట్‌కు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఈ ఐదు టవర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం జరుగుతోందన్నారు. బుధవారం రాజధానిలో నిర్మిస్తున్న హెచ్‌ఓడీ టవర్ -3 కార్నర్ నోడ్ అమర్చే పనులకు మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో 4 నెలల పాటు ఈ పనులకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు.


ఐకానిక్ భవనాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫైనాన్స్ మోడల్ ఇచ్చారని చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా రాజధాని అమరావతికి ఖర్చు పెట్టడం లేదని పేర్కొన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కొంతమంది అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


అమరావతిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తే.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్‌తో పాటు ఇంజనీర్లు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండో రోజు సిట్ కస్టడీకి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు నిందితులు

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

For More AP News And Telugu News

Updated Date - Mar 25 , 2026 | 11:43 AM