Share News

రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:37 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లుకు సభ ఆమోదం తెలపడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఢిల్లీ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: మంత్రి లోకేశ్..
Minister Nara Lokesh

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లుకు సభ ఆమోదం తెలపడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఢిల్లీ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాజధానిగా అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారని గుర్తు చేశారు. 2014లో అమరావతికి అందరూ మద్దతు తెలిపారని.. ఆనాడు జగన్‌ కూడా అమరావతికి మద్దతు పలికారని లోకేశ్ పేర్కొన్నారు.


ఏపీ కోసం వేలాది మంది రైతులు తమ భూములు ఇచ్చారని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. రాజధాని మార్చబోమన్న జగన్‌ మాటలు నమ్మి.. 2019లో వైసీపీని ప్రజలు గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని, వైసీపీ అధినేత నిర్వాకంతో రైతులు వేదనకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సంకెళ్లు వేశారని.. అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. గర్భిణిని కడుపులో తన్నారని.. మహిళలను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేశారని.. రాజధాని ప్రాంతంలో ఐదేళ్లపాటు 144 సెక్షన్‌ కొనసాగిందన్నారు.


రాజధానిపై వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని.. వైసీపీ మూడు రాజధానులను ఏపీ ప్రజలు తిరస్కరించారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2024లో అమరావతే ఏకైక రాజధాని అంటూ ప్రజలు తీర్పునిచ్చారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోక్ సభ, రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు లోకేశ్. అమరావతికి వైసీపీ మినహా దేశమంతా అండగా నిలిచిందన్నారు. అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని తెలిపారు.


రెండేళ్లలో ఫేజ్‌-1 పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. కేంద్రం నుంచి ఇప్పటికే రూ.18 వేల కోట్ల సాయం అందిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎమ్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సెంటర్ ప్రాజెక్టులు, విద్య, ఐటీ, పరిశ్రమల కేంద్రంగా అమరావతి నిలుస్తుందని చెప్పారు. మూడు ఆర్థిక ప్రాంతాలుగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

Updated Date - Apr 02 , 2026 | 06:44 PM