Share News

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.. పేరును ప్రకటించిన పవన్..

ABN , Publish Date - Jun 05 , 2026 | 07:55 PM

తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. లింగమనేని పేరును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు వెల్లడించింది.

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.. పేరును ప్రకటించిన పవన్..
Lingamaneni Ramesh

అమరావతి: తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. లింగమనేని పేరును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపింది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం రమేశ్ పేరును పవన్ ప్రకటించినట్లు పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేరుతో ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా 2015 నుంచి పార్టీతో, పవన్ కల్యాణ్‌తో రమేశ్ అనుబంధం కొనసాగుతోందని జనసేన ప్రకటనలో తెలిపింది.


ఏపీ అభివృద్ధి చెందాలంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత అవసరమని.. అందుకు సోషల్ ఇంజనీరింగ్ అవసరమనే పవన్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటే రమేశ్ ఉన్నారని పేర్కొంది. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జనసేన సిద్ధాంతాలపై, పార్టీ అధ్యక్షుడిపై విశ్వాసం ఉంచి, ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించారని పేర్కొంది. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కల్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారని తెలిపింది.


జనసేనతో లింగమనేని..

'2014లో జనసేన ఏర్పాటు చేసినప్పుడు ప్రకటించిన పార్టీ సిద్ధాంతాలకు లింగమనేని రమేశ్ ఆకర్షితులయ్యారు. 2015 నుంచి పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తూ ఆయన వెన్నంటే ఉన్నారు. 2018లో పవన్ ఒంటరి ప్రయాణం చేశారు. ఆ సమయంలో టీడీపీతో, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీతో రమేశ్ మాటలుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రమేశ్ వ్యాపారాలను ముందుకు సాగకుండా కక్ష సాధింపు చర్యలకు దిగింది. కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అయినప్పటికీ ఆయన వెరవలేదు. అన్నింటినీ తట్టుకుని జనసేనతో నిలబడ్డారు. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న దశలోన పవన్‌తో ప్రయాణం సాగించారు. అందుకే రాజ్యసభ అభ్యర్థిగా ఈసారి లింగమనేని రమేశ్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు' అంటూ జనసేన వెల్లడించింది.


ఎవరీ లింగమనేని రమేశ్..?

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో లింగమనేని రమేశ్ జన్మించారు. తన 19వ ఏట నుంచే ఆయన పని చేయడం ప్రారంభించారు. మెుదటగా వారి కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో లింగమనేని పాలుపంచుకున్నారు. భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నిలిచారు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ సంస్థ ఏపీలోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మరోవైపు 2013-17 మధ్య ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా లింగమనేని రమేశ్ పని చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.. పేరును ప్రకటించిన పవన్..

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

Updated Date - Jun 05 , 2026 | 08:25 PM