కూటమి సమన్వయ కమిటీ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ..
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:56 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర నాయకులతో ఆయన భేటీ అయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సమన్వయ కమిటీ సమావేశాల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో జరిగిన కూటమి సమావేశాల సారాంశాన్ని చంద్రబాబుకు పల్లా, నిమ్మల వివరించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఛైర్మన్ పదవితో పాటు 50 శాతం కార్పొరేటర్ స్థానాలు ఆశిస్తున్నట్లు చంద్రబాబుకు సమన్వయ కమిటీ సభ్యులు పల్లా, నిమ్మల తెలిపారు. అలా చేయడం ద్వారా ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ సమన్వయంతో పనిచేసే వెసులుబాటు ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, కూటమిలోని బీజేపీ ఆలోచన మాత్రం వేరుగా ఉందని టీడీపీ అధినేతకు తెలిపారు. తమ ఎమ్మెల్యే ఉన్న చోట నాయకత్వం ఎలాగూ ఉంటుంది కాబట్టి, వేరొక చోట ఛైర్మన్, కార్పొరేటర్ స్థానాలు కేటాయించాలన్నది బీజేపీ ప్రతిపాదనగా ఉందని వివరించారు.
తద్వారా ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ స్థానిక నాయకత్వం బలపడే అవకాశం ఉంటుందని బీజేపీ ఆలోచనగా ఉందన్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో సమన్వయ కమిటీ సమావేశాలు పూర్తి కావడంతో నేడు, రేపు రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటామని వెల్లడించారు. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కానందున అభ్యర్థుల పోటీపై రిజర్వేషన్లు తేలాకే తుది నిర్ణయం తీసుకోగలమని సీఎంకు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం కంటే ఎక్కువగా స్థానిక ఎన్నికల్లో సాధించాలని సమన్వయ కమిటీ సభ్యులకు చంద్రబాబు సూచించారు.
ఈ మేరకు వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి నేతలు ఐక్యంగా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, భేటీ సందర్భంగా జనసేన ఆశిస్తున్న స్థానాల జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఇచ్చి ఉండవచ్చని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..!