Share News

సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు.. నిజాలు వెల్లడించిన ఎస్పీ..

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:56 PM

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను లాయర్ సురేశ్ హత్య చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు.. నిజాలు వెల్లడించిన ఎస్పీ..
Guntur Lawyer Suresh Arrested

గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను లాయర్ సురేశ్ హత్య చేశాడని విచారణలో తేల్చారు. వివాహేతర సంబంధం, నగదు లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని నిర్ధారించారు. నిందితుడితో సహా మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.


ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ..' కొన్ని రోజుల కిందట పాత గుంటూరు యాదవ బజారుకు చెందిన ఓ మహిళ కనపడడం లేదని ఫిర్యాదు అందింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఇటీవల పాత గుంటూరు కాలువలో ఓ మహిళ మృతదేహం ఉందని స్థానికుల నుంచి సమాచారం అందింది. ఆ సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాలువలో లభ్యమైన మృతదేహం పాత గుంటూరులో కొన్ని రోజుల కిందట అదృశ్యమైన మహిళదిగా గుర్తించారు. కొన్నాళ్ల నుంచి ఆమె ఎనముల సురేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.


గుంటూరులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సురేశ్.. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.25 లక్షలు తీసుకున్నాడు. అనంతరం వారి మధ్య డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న సురేశ్.. తన స్నేహితుడు శేఖర్‌తో కలసి ప్లాన్ చేశాడు. పథకం ప్రకారం ఆమెను శ్రీశైలం వెళ్దామని పిలిచారు. ఆ తర్వాత సమయం చూసి కర్రలతో మహిళ తలపై దాడి చేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని సంఘం జాగర్లమూడి కాలువలో పడేసి వెళ్లిపోయారు. పోలీసు దర్యాప్తులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నాం' అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

విషాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురి మృతి

వివాహ రిసెప్షన్‌లో దారుణం.. పెళ్లికొడుకుపై కత్తితో దాడి

Updated Date - Apr 15 , 2026 | 03:56 PM