Share News

రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్..

ABN , Publish Date - Apr 01 , 2026 | 08:13 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్..
Deputy CM Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని.. లోక్ సభలో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీలు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్ చేశారు.

అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు బలమైన గుణపాఠం నేర్పిస్తారని మండిపడ్డారు. రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో.. అమరావతి ప్రజారాజధానిగా, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్..

'లోక్‌ సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన ఈ చారిత్రక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది పౌరులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. అమరావతిని ఏపీ ఏకైక, శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ అమరావతి బిల్లు ఆమోదం పొందడం ప్రజా సంకల్పం, స్థైర్యం, ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది. రాజధానికి 33,000 ఎకరాలకు పైగా భూమిని అప్పగించి సాటిలేని త్యాగం చేసిన అమరావతి ప్రాంత రైతాంగానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి చేసిన త్యాగం తరతరాలపాటు గుర్తుండిపోతుంది.


అమరావతి నిర్మాణానికి పునాది వేసి అచంచలమైన నిబద్ధత కలిగిన సీఎం చంద్రబాబు దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కలను సాకారం చేయడంలో నిరంతర మద్దతు అందించిన ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత ప్రభుత్వపు తిరోగమన, ఏకపక్ష నిర్ణయాల వల్ల తలెత్తిన సవాళ్ల సమయంలో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తమ ఆశయాలకు అనుగుణంగా స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రగతి, స్థిరత్వానికి అనుగుణమైన భవిష్యత్తును ఎంచుకున్నారు.


పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో బలమైన నూతన విశ్వాసం చిగురించింది. అమరావతి ఇకపై కేవలం ఒక రాజధానిగా మాత్రమే కాకుండా ఆశలకు, స్థైర్యానికి, సమష్టి సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. 'స్వర్ణ ఆంధ్ర-2047' కలను సాకారం చేయడంలో అమరావతి కీలకపాత్ర పోషిస్తుందని, అలాగే ప్రధాని మోదీ 'వికసిత్ భారత్- 2047' లక్ష్యానికి గణనీయమైన తోడ్పాటును అందిస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నా' అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది

Updated Date - Apr 01 , 2026 | 08:17 PM