స్త్రీల సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన పూలే: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:31 AM
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి, స్త్రీల సాధికారత కోసం పూలే జీవితాంతం కృషి చేశారని తెలిపారు.
అమరావతి, నవంబర్ 28: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి, స్త్రీల సాధికారత కోసం పూలే జీవితాంతం కృషి చేశారని తెలిపారు. సామాజిక సమానత్వ సాధనకు మహాత్మా పూలే అవిశ్రాంతంగా పనిచేశారని కొనియాడారు. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని చాటిన మహనీయుడు పూలే అని గుర్తు చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భారత సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం 'ఎక్స్' వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.
కుల వ్యవస్థకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మ పూలే: మంత్రి లోకేష్
కుల వ్యవస్థకు, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే పోరాడారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. పూలే గొప్ప మానవతా వాది అని గుర్తు చేశారు. ఆయన తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతితోపాటు మహిళా విద్య కోసం అంకితం చేశారని అన్నారు. ఆయన కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకమని చెప్పారు. పూలే వర్ధంతి సందర్భంగా.. ఆయన చేసిన కృషిని స్మరించుకుందామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పది మంది మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే.. చాణక్యుడు చెప్పిన టిప్స్
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర