పది మంది మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే.. చాణక్యుడు చెప్పిన టిప్స్
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:02 AM
ఓ వ్యక్తిలోని బాహ్య సౌందర్యం కంటే.. చిన్న చిన్న అలవాట్లే అతడిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అవే మిమ్మల్ని పది మంది గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ఈ అంశంపై చాణక్యుడు పలు అంశాలు సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తిలోని బాహ్య సౌందర్యం కంటే.. చిన్న చిన్న అలవాట్లే అతడిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అవే మిమ్మల్ని పది మంది గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ఈ అంశంపై చాణక్యుడు పలు అంశాలు సూచించారు.
తక్కువ మాట్లాడే అలవాటు..
తక్కువ మాట్లాడే వారే ఇతరుల దృష్టిలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. ఎదుట వారు చెప్పింది శ్రద్ధగా వింటూ.. మాట్లాడే ముందు ఆలోచిస్తూ.. ఆచితూచి మాట్లాడే వ్యక్తులు ఇతరుల కంటే సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తారు. సైలంట్‌గా ఉండటం.. ఇతరుల మనస్సుల్లో ఉత్సకతను పెంచుతుంది. ఈ అలవాడు ఓ వ్యక్తిని మానసికంగా, భావోద్వేగపరంగా సమతుల్యంగా ఉంచుతుంది. అందుకే బిగ్గరగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించే వారి కంటే.. నెమ్మదిగా ఆలోచించి మాట్లాడే వారు మరింత ప్రభావవంతంగా, ఆకర్షణీయంగా ఉంటారు.
పరిశుభ్రత.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..
ఆకర్షణ, ఆత్మవిశ్వాసానికి మంచి అనుబంధం ఉంది. ఖరీదైనవి కాకున్న శుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే పరిశుభ్రత పాటించాలి. ఫ్రెష్‌గా ఉండటంతోపాటు జుట్టును చక్కగా క్రాఫ్ చేయించి.. నీటుగా ఉంచుకోవాలి. అదే విధంగా ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడాలి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు.. ఇతరుల దృష్టిలో మీ రూపాన్ని మార్చేస్తాయి. ఇలాంటి వ్యక్తులను.. క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసం కలిగిన వారని మీ చుట్టూ ఉన్న వారు సులభంగా గుర్తిస్తారు.
కోపం కంటే..
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎలా స్పందిస్తాడో.. దాని ద్వారా అతని నిజమైన బలం బయటపడుతుంది. చాలా మంది తమ కోపం, అసూయ, అహం, ఆందోళనను అదుపు చేసుకోలేనప్పుడు తమ ప్రభావాన్ని కోల్పోతారు. వారు ఏమి ఆలోచించకుండా స్పందిస్తారు. ఆ తర్వాత పశ్చాతాపపడే విధంగా పరుష పదాలు మాట్లాడతారు. అయితే ఘర్షణ, వాగ్వివాదాల సమయంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి మరింత బలవంతుడిగా, పరిణితి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రశాంతంగా ఉండడం అనేది అవగాహనకు సంకేతం. మీరు ఇతరుల భావోద్వేగాలకు లోనుకారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
తీరికలేని జీవితం..
తమను తాము గౌరవించుకునే వారు.. ఇతరులను కూడా గౌరవిస్తారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించే వ్యక్తులు కాలక్రమేణ ఆకర్షణను కోల్పోతారు. దీనికి విరుద్ధంగా తమ లక్ష్యాలు, అభిరుచులు, పని, ఆరోగ్యం, స్వీయ అభివృద్ధి తదితర అంశాలపై దృష్టి సారించే వ్యక్తులు.. ఆకర్షణీయంగా కనిపిస్తారు.
గౌరవమే మిమ్మల్ని గుర్తించుకునేలా చేస్తుంది..
ఓ వ్యక్తి.. ఇతరులతో ప్రవర్తించే తీరును బట్టి వారి వ్యక్తిత్వాన్ని నిర్ధారించవచ్చు. డబ్బు, అందం, హోదా ఉండి.. అహంకారంతో ప్రవర్తిస్తూ, అమర్యాదగా, అవమానకరంగా మాట్లాడే వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. అయితే ఇతరుల పట్ల గౌరవంగా మసులుకుంటూ, ఇతరులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండేవారిని.. పది మంది గుర్తుంచుకుంటారు.