31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:42 PM
విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, సాంకేతికత, ప్రజా విధానాలు, నాలెడ్జ్ షేరింగ్‌కు వేదికగా ఈ సదస్సును నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి: నవంబర్‌లో నిర్వహించనున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. 'Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World' అనే అంశాన్ని ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఖరారు చేశారు. ప్రధాన సదస్సుకు ముందు విశాఖపట్నం, రాజమహేంద్రవరం లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించే అంశంపైనా చర్చించారు. ఈ సమావేశాల ద్వారా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు జరపడమే కాకుండా ప్రాంతీయ స్థాయిలో అవగాహన పెంచాలని నిర్ణయించారు.
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఎంఓయూలు, మినిస్టీరియల్ సెషన్లు, ప్లీనరీ సమావేశాలు, కంట్రీ సెషన్లు, బీ2బీ, బీ2జీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించనుంది. సదస్సుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కేవలం పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకే పరిమితం కాకుండా ప్రజా విధానాలు, సాంకేతికత, వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, ఒత్తిడి లేని పని సంస్కృతి వంటి అంశాలపై కూడా విస్తృత చర్చలు జరగాలని సూచించారు. ప్రాంతీయ సమావేశాల్లోనూ ఎంఓయూలు కుదిరేలా చర్యలు తీసుకోవాలని, ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నిపుణులను సదస్సుకు ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్నదానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత జరిగిందన్నదే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
Also Read:
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..
ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం