Share News

ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:56 PM

ఏఐతో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డు మళ్లీ ఇంజనీర్లను నియమించుకుంటోంది. గతంలో ఉద్యోగాల నుంచి తీసేసిన వారిని కూడా మళ్లీ సంస్థలోకి ఆహ్వానిస్తోంది.

ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం
Ford Rehiring Veteran Engineers

ఇంటర్నెట్ డెస్క్: ఏఐతో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మళ్లీ ఇంజనీర్లను నియమించుకుంటోంది. గతంలో ఉద్యోగాల నుంచి తీసేసిన వారిని కూడా మళ్లీ సంస్థలోకి ఆహ్వానిస్తోంది. ఇంజనీర్ల రాకతో పరిస్థితులు ఇప్పటికే మెరుగయ్యాయి. వాహనాల నాణ్యత పరీక్షల కోసం గతంలో ఫోర్డు ఏఐవైపు మొగ్గు చూపింది. కానీ ఏఐ పనితీరు ఆశించిన మేర లేకపోవడంతో కంపెనీ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి. జేడీ పవర్ క్వాలిటీ సర్వేలో వెనకబడింది. దీంతో పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ఫోర్డ్ మళ్లీ ఇంజనీర్లను రంగంలోకి దించింది. దీంతో, నెలల వ్యవధిలోనే కంపెనీ ర్యాంకు మెరుగుపడింది.


అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, గత మూడేళ్లల్లో ఫోర్డ్ 350 మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లను క్వాలిటీ కంట్రోల్ చెక్స్ కోసం నియమించుకుంది. వీరిలో కొందరు మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏఐపై అతిగా ఆధారపడ్డామని కంపెనీ సీనియర్ అధికారులు కూడా అంగీకరించారు. ఏళ్ల తరబడి అనుభవాన్ని గడించిన ఇంజనీర్లను పక్కనపెట్టడం పొరపాటేనని అన్నారు. ఏఐ సామర్థ్యాల గురించి అతిగా ఊహించుకున్నామని ఫోర్డ్ వైహికిల్ హార్డ్‌వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఛార్ల్స్ పూన్ వ్యాఖ్యానించారు. ‘ఏఐని, డిజైన్ అవసరాలను అనుసంధానిస్తే మంచి నాణ్యత గత ఉత్పత్తులు వస్తాయని పొరపాటున అనుకున్నాము’ అని ఆయన అన్నారు.


ఎలాంటి సమాచారంతో శిక్షణ ఇచ్చామన్న దానిపైనే ఏఐ సమర్థత ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అయితే, ఏఐ ఒక అద్భుత సాధనమని కూడా ఆయన అంగీకరించారు. ఎన్నో ఏళ్ల పాటు సంస్థలో పనిచేసిన ఇంజనీర్ల అనుభవాన్ని సేకరించి రికార్డు చేయడంలో తాము చేయవల్సినంత చేయలేదని అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏఐతో సాధ్యం కాని పనులకు మళ్లీ ఇంజనీర్ల నియామకాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఇలా మళ్లీ విధుల్లోకి చేరిన సీనియర్ ఇంజనీర్లు యువ సిబ్బందికి, ఏఐకి శిక్షణ ఇవ్వడంలో తోడ్పాటునందిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అటాచ్‌మెంట్‌లతో జాగ్రత్త.. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు హెచ్చరిక

80 ఏళ్ల చిక్కుముడిని ‘ఏఐ’ విప్పింది!

Updated Date - Jun 29 , 2026 | 07:07 PM