గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:19 PM
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అమరావతి, ఆగస్టు 19: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమ జిల్లాలోని మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు బుధవారం ఆరా తీశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్‌గా సమావేశమయ్యారు.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని సీఎంకు వారు వివరించారు.
జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు వివరించారు. పారాదీప్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని.. వాటి గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు.
కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్
For More AP News And Telugu News