Share News

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:23 PM

యువత భవిష్యత్తుతో చెలగాటమాడే ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
PPSC Group 1 Mains

అమరావతి, ఆగస్టు 19: యువత భవిష్యత్తుతో చెలగాటమాడే ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలపై అసెంబ్లీలో చర్చ ముగిసింది. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో తప్పులు చేయాలంటే భయపడేలా కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గత పాలకుల హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారనడానికి ఇదో ఉదాహరణ అని సీఎం తెలిపారు. గ్రూప్‌-1 మూల్యాంకనం విషయంలో కోర్టుల సూచనలు.. ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం, హాయ్‌ల్యాండ్‌కు తీసుకెళ్లడం, కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడం వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ, అనంతరం సిట్‌ దర్యాప్తులో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. యువత జీవితాలతో ఆడుకోవడం కంటే దారుణం మరొకటి లేదని, ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థలు, సమాజం ముఖ్యమని అన్నారు. రాష్ట్ర యువత ప్రతిభను గుర్తించి వారి భవిష్యత్తుకు అండగా ఉంటామని చెప్పారు. టెక్నాలజీతో పాటు జాతీయ స్థాయి పరీక్షల్లో ఏపీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, అలాంటి యువతకు అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో ప్రజా చైతన్యాన్ని చూపించారన్నారు. రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేసే సంస్కృతి పోయినప్పుడే వ్యవస్థల్లో అవినీతి, అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 19 , 2026 | 07:17 PM