'వైజాగ్ 1' యాప్ వినూత్న రూపకల్పనపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:44 PM
అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. పాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువయ్యే విధానాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళితే..
అమరావతి, మార్చి 11: అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో(District Collectors Conference) భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. పాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువయ్యే విధానాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ఏడు జిల్లాల కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. అనకాపల్లి జిల్లాలోని(Anakapalle District) పాఠశాలలు, హాస్టళ్లలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లు అద్భుతమని సీఎం కొనియాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ఇది ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కరువు ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో నీటి నిల్వలను పెంచేందుకు కలెక్టర్ చేపట్టిన వినూత్న ఆలోచనలను సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. కరువు నేలను జలసిరులతో నింపేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పాలనను ప్రజల ముంగిట ఉంచేందుకు రూపొందించిన ‘వైజాగ్ 1’ (Vizag 1) యాప్ రూపకల్పనపై కలెక్టర్ పనితీరును ప్రశంసించారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సత్ఫలితాలిస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టును అన్ని జిల్లాల్లోనూ తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వచ్చిన 7 సక్సెస్ స్టోరీలు రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే కలెక్టర్ల సదస్సుకు 28 జిల్లాల నుంచి 28 సక్సెస్ స్టోరీలు రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో సామాన్య ప్రజలకు నిత్యావసరాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన LPG (వంట గ్యాస్) నిల్వలు, సరఫరా, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ముగ్గురు సభ్యుల మంత్రుల కమిటీని సీఎం ప్రకటించారు. ఈ మంత్రుల కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను క్రమం తప్పకుండా సమీక్షించి ముఖ్యమంత్రికి నివేదికలు సమర్పించనుంది. తద్వారా పౌర సరఫరాల శాఖలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
సభలో మాట్లాడే అవకాశం రాహుల్‌కి ఇవ్వలేదు: ఎంపీ మల్లు
ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ