Share News

టీచర్లను క్యూ లైన్లలో నిలబెట్టి అవమానించింది జగనే: ఎంపీ చింతకాయల విజయ్

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:58 PM

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పార్లమెంట్ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయుల పట్ల జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.

టీచర్లను క్యూ లైన్లలో నిలబెట్టి అవమానించింది జగనే: ఎంపీ చింతకాయల విజయ్
Chintakayala Vijay

అమరావతి, సెప్టెంబర్ 07: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పార్లమెంట్ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయుల పట్ల జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో దేవుళ్ల లాంటి టీచర్లను వైన్ షాపుల వద్ద క్యూ లైన్లలో నిలబెట్టి అవమానించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య కనీస తేడా కూడా తెలియని వ్యక్తి జగన్ అని విజయ్ ఎద్దేవా చేశారు.


తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ విజయ్ మాట్లాడుతూ.. 'గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. వైసీపీ హయాంలో ఏకంగా 12 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చి.. నిరుద్యోగుల పట్ల మంత్రి నారా లోకేశ్ చిత్తశుద్ధిని చాటుకున్నారు. చట్టసభలకు వచ్చే దమ్ములేక కేవలం ప్రెస్ మీట్లు పెట్టి అవాస్తవాలు ప్రచారం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారు' అని ఎంపీ విజయ్ దుయ్యబట్టారు.


కుప్పంలో పాఠాలు చెబుతున్న మాజీ ఆర్మీ ఉపాధ్యాయుడిని సాక్షి రిపోర్టర్‌తో బెదిరించడం దారుణమని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నీ ఏకమై వైసీపీని రాజకీయంగా భూస్థాపితం చేస్తాయని హెచ్చరించారు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే ప్రజల నమ్మకం గెలుచుకుని, ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ఎంపీ చింతకాయల విజయ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

'నాన్న , మీరు గర్వపడేలా చేస్తా'.. కొడుకు చివరి మాటలకు తండ్రి కన్నీరు!

Updated Date - Sep 07 , 2026 | 05:00 PM