New Year Greetings: ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:14 AM
న్యూ ఈయర్ వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఎక్స్ ఖాతా వేదికగా వీరంతా శుభాకాంక్షలు చెప్పారు.
అమరావతి, జనవరి 01: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప్రజలకు 2026 సంవత్సరంలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యం చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని ఆకాంక్షించారు. 2025లో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాల్ని అందించిందన్నారు. ఎన్నో మైలురాళ్లను చేరుకుందని.. అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు నాంది పలికిందని గుర్తు చేశారు. ఇది ఒక సంవత్సరం కాదు.. నాటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు అని అభివర్ణించారు. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లను అధిగమించామని చెప్పారు. 2026లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగనుందన్నారు. ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని చెప్పారు.
మరోవైపు సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో 2026లో తొలి సూర్యోదయం అరకు లోయ నుంచి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్ చేశారు. అరకు లోయలో సూర్యోదయం వీడియోలు సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిబద్ధులైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి నేతృత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రివర్గ సహచరులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, శాసన సభాపతి, ఉప సభాపతి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరం సమష్టిగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన రథం సక్రమ మార్గంలో పరుగులు తీయడంలో భాగస్వాములైన చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్యకార్యదర్శులు, హెచ్ ఓ డీలు, జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఇతర ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు మేలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అందరూ మరింత అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల ప్రమోషన్లు పొందిన ఐఏఎస్ అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన డీజీపీ, ఏడీజీ, ఐజీలు, రేంజ్ డీఐజీలు, సిటీ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఏఎస్పీలు, డివిజన్, సర్కిల్ అధికారులు, ఎస్సైలు, కానిస్టేబుల్స్, రిజర్వ్, బెటాలియన్ సిబ్బంది, హోమ్ గార్డులకి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విపత్తు నిర్వహణ దళాలు, అగ్నిమాపక సిబ్బందికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది శాంతి భద్రతలను కాపాడుతూ.. సామాన్యుడు ప్రశాంత జీవనానికి భరోసా ఇస్తారని, ఆడ బిడ్డల గౌరవానికి భంగం కలిగించే వ్యక్తులను చట్టబద్ధంగా కట్టడి చేయాలని కోరుకొంటున్నానని పేర్కొన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఐపీఎస్, పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలను ప్రజాహితంతో రాజ్యాంగబద్ధంగా నడిపిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక సంస్థల పాలనలో భాగమైన జిల్లా పరిషత్ ఛైర్మన్లు, సర్పంచులు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లతోపాటు పీఆర్ అండ్ ఆర్డీలో పదివేల మందికి పదోన్నతులు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. అటవీ శాఖలో ప్రమోషన్లు అందించామని.. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత ఉత్సాహంతో బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకొంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
మంత్రి నారా లోకేశ్..
ప్రజలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆశయాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కలలు సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమిద్దామని స్పష్టం చేశారు. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దామన్నారు. ప్రగతి సంక్షేమాలతో నవవసంతం ప్రజలకు ఆయురారోగ్య, ఆనందాలు పంచాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ప్రజాభవన్‌కు..
ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..
For More AP News And Telugu News