New Year Resolutions: ఇలా చేయండి.. మీరే నంబర్ వన్ అవుతారు..
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:27 AM
అతికొద్ది మంది మాత్రమే కాలం విలువను గుర్తిస్తున్నారు. కాలం విలువను తెలుసుకోలేక ఎంతోమంది రోజులను గడిపేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఎప్పటిలాగే మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది.
'కాలం నీతో నడవదు. నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు. దానికి సమయమే కదరా ఆయుధం'.. అంటూ సాగే పాట కాలం విలువను తెలియజేస్తుంది. జీవితంలో ప్రతీక్షణమూ విలువైనదే.. పోయినకాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేమనేది ఈ పాటలోని భావం. అయితే అతికొద్ది మంది మాత్రమే కాలం విలువను గుర్తిస్తున్నారు. కాలం విలువను తెలుసుకోలేక ఎంతోమంది రోజులను గడిపేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఎప్పటిలాగే మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఏడాదిలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతోమంది సిద్ధమవుతుంటారు.
అప్పటివరకు నిరుత్సాహంతో ఉండేవారికి కొత్త ఏడాది అంటేనే ఉత్సాహం కట్టలు తెచ్చుకుంటుంది. కొత్త ఆలోచనలు, సంకల్పాలు మెదడును తట్టిలేపుతుంటాయి. 'ఇకనైనా మారాలి' అని శపథం చేసేవారు కోకొల్లలు. అటువంటి వారంతా కొత్త ఏడాది నుంచి ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. తీసుకునే నిర్ణయాలను ఎలా ఆచరణలో పెట్టాలి అన్నది చాలా ముఖ్యం. నూతన సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి. వాటిని ఎలా అమలుచేయాలనే దానిపై అందిస్తున్న ప్రత్యేక కథనం..
సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ముఖ్యం..
జీవితంలో అన్నింటి కంటే విలువైనది కాలం. గడిచిన కాలాన్ని తీసుకురాలేం. రోజులో ఎవరికైనా 24 గంటలే ఉంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే ఉన్నత స్థానాలను అధిరోహిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామన్నది చాలాముఖ్యం. వేకువజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవడంతో పాటు రాత్రి పడుకునేంత వరకు సమయాన్ని లెక్కగట్టి ఒక్కో పనికి కొంత సమయాన్ని కేటాయిం చుకోవాలి.
లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి..
కొత్త ఏడాదిలో తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఎక్కువ నిర్ణయాలు తీసుకున్నా అమలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలపై స్పష్టతతో పాటు అమలు చేసే ప్రణాళిక ముఖ్యం. అందుకు అనుగుణంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాల పరిమితి తక్కువగా పెట్టుకోవాలి. ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం పెట్టుకోవడం వల్ల ఆ లక్ష్యాన్ని సాధించే ప్రణాళికలు బలంగా ఉండడంతోపాటు సాధించాలన్న ఆకాంక్ష, పట్టుదల దృఢంగా ఉంటాయి.
పొదుపు మంత్రం..
నేటి కాలంలో ప్రతి చిన్న అవసరానికి డబ్బు ప్రామాణికంగా మారింది. పొదుపు మంత్రాన్ని పాటించడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. సమాజం ఆర్థికంగా బలోపేతమైనవారికే విలువ, గౌరవాన్ని ఇస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే ఎంతటివారైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. నెలవారీ వచ్చే ఆదాయాన్ని, ఖర్చులను లెక్క చూసుకుని కనీసం 20-30 శాతం పొదుపు చేసేలా ప్రణాళికలు వేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పొదుపు ఆర్థిక క్రమశిక్షణ తోనే సాధ్యపడుతుంది. అనవసరపు ఖర్చులు, ఆర్భాటాలు, ఎదుటీవారితో పోల్చుకుని బతకాలనే కోరికలు అప్పుల పాలయ్యేలా చేస్తుందని, ఇటువంటి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నిర్ణయాలు తప్పనిసరి..
కొత్త ఏడాదిలో తీసుకునే నిర్ణయాల్లో తప్పనిసరిగా కొన్నింటిపై స్పష్టత ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దురలవాట్లకు దూరంగా ఉండటం అత్యంత కీలకం. స్మోకింగ్, ఆల్కహాల్, బెట్టింగ్ ఆరోగ్యానికి, జీవితానికి హాని చేసే ఇతర అలవాట్లకు దూరంగా ఉండాలి. వీటి బారినపడేందుకు కారణమయ్యే స్నేహాలు, బంధువులను వీలైనంత వరకు కొత్త ఏడాదిలో విడిచిపెడితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యమే మహాభ్యాగం..
ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటుండేవారు. అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే చాలా కష్టం. కాబట్టి, ఆరోగ్యంపై దృష్టి సాదించేలా కొత్త ఏడాదిలో నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో అనారోగ్యం పాలైతే ఆసుపత్రుల ఖర్చులు భరించలేనంతగా ఉన్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది. ఎప్పుడు, ఏం తింటున్నారో, ఎప్పుడు నిద్రిస్తు న్నారో, ఎప్పుడు మేల్కొంటున్నారో తెలియడం లేదు. ఆహారం, వ్యాయామం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కీలకం. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, ఉదయాన్నే లేచి నడక, ఇతర శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిత్య విద్యార్థిలా..
చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్న కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. కొత్త ఏడాది నుంచైనా ఈ అలవాటకు కొంత సమయం కేటాయించడం మంచిది. నేటి కాలంలో ప్రతి రంగంలో తీవ్ర పోటీ ఉంది. కాబట్టి, నిరంతర అధ్యయనంతోనే ఆయా రంగాల్లో సుదీర్ఘకాలం కొనసాగేందుకు అవకాశముంటుంది. ఆ దిశగా కొత్త ఏడాదిలో నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ భద్రతకు అవకాశముంటుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సర్వసాధారణమైంది.. ఒత్తిడి వల్ల వచ్చే అనేక అనారోగ్య సమస్యలెన్నో. దీని నుంచి దూరంగా ఉండడానికి యోగా, వ్యాయామం, మెడిటేషన్ జీవితంలో భాగం చేసుకోవాలి. మానసిక ఉల్లాసాన్ని కలిగించే పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల ఉత్సాహంగా ఉండే అవకాశముంది. సమయానికి నిద్ర, భోజనం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిర్ణయాలు కొనసాగించాలంటే..
కొత్త ఏడాదిలో తీసుకునే నిర్ణయాలను అమలుచేసే వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. నిర్ణయాలను ఆచరించేందుకు వీటిని పాటించి, దానికనుగుణంగా మనసును సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతేడాది తీసుకున్న నిర్ణయాల్లో అమలు చేసినవెన్ని, చేయలేక పోయినవెన్ని, దానికి గల కారణాలను విశ్లేషించుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. సాధించడానికి వీలున్న తక్కువ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యాలు ప్రతిరోజు గుర్తుండేలా బోర్డు/డైరీ ఏర్పాటు చేసుసు కోవాలి. తీసుకున్న నిర్ణయాలతో ఇతరులతో పంచుకోవడం వల్ల సాధించాలన్న తపన పెరుగుతుంది. నిర్ణయాలపై ప్రతివారం, నెల సమీక్షించుకోవాలి.