Share News

అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు థ్యాంక్స్

ABN , Publish Date - Feb 10 , 2026 | 06:06 PM

సీఎం చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఆయన కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పూర్తి కావాల్సిన పలు ప్రాజెక్ట్‌ వివరాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రి.

అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు థ్యాంక్స్
CM Chandrababu Meeting With Central minister Ashwini Vaishnaw

న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన మంగళవారం బిజీ బిజీగా సాగుతోంది. కేంద్ర మంత్రులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్త రైలు మార్గాలలో సర్వీసులను నడపాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, చెన్నై - బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ల గురించి ఈ భేటీలో ప్రస్తావించారు చంద్రబాబు. అలాగే ఏపీ మీదుగా వెళ్లే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


ఇక బెంగళూరు - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్.. తిరుపతిని అనుసంధానం చేసేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్‌పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని మంత్రిని కోరారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.


దేశంలో ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపేలా ఇటార్సీ - విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్‌పూర్ - చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను అనుసంధానించేలా వివిధ కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు.


అదే విధంగా.. విశాఖ - విజయవాడ మధ్య హైస్పీడ్, విజయవాడ - కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి - చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ - శ్రీశైలం - మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి మీదుగా విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీసును నడపాలన్నారు. ఇక వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతో పాటు రైలు బోగీల నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 07:18 PM