Share News

వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు: సీఎం చంద్రబాబు నాయుడు

ABN , Publish Date - Feb 24 , 2026 | 02:03 PM

గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది.

వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు: సీఎం చంద్రబాబు నాయుడు
AP CM Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 24: గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రక్షాళన కోసం ఈవోను నియమించామని చెప్పారు.


తన దృష్టికి వచ్చిన నేషనల్ డైయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) రిపోర్ట్ వివరాలు వెల్లడించానని తెలిపారు. శ్రీవారి లడ్డూ విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో తప్పు చేశారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 59.71లక్షల కేజీల రసాయనాలతో కూడిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారని వివరించారు. తద్వారా రూ. 234.51 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ అగ్రనేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ల్యాబ్‌ల కళ్లుగప్పి నెయ్యి టెండర్లు దక్కించుకున్నారని విమర్శించారు. 2019 - 24 మధ్య రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని పేర్కొన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. 2026 జనవరి 23న ఈ కల్తీ లడ్డూ వ్యవహారంలో సీబీఐ చార్జ్‌షీట్ వేసిందని గుర్తు చేశారు. అలిపిరి ఘటనలో శ్రీవేంకటేశ్వర స్వామి వారే తన ప్రాణాలను కాపాడారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.


కల్తీ నెయ్యి వినియోగం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సిట్ వేయాలని ఆలోచించినట్లు ఏపీ సీఎం తెలిపారు. సిట్ ఏర్పాటును వైసీపీ నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారని గుర్తు చేశారు. రాజకీయ వివాదం ఉండొద్దనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో సిట్ ఏర్పాటు చేశామని వివరించారు. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించిందన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపిందని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినందుకే ఏకసభ్య కమిటీ అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీబీఐ రిపోర్టుతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు.


2020 జనవరి, ఫిబ్రవరిలో టెండర్ల నిబంధనలు మార్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాణ్యతా ప్రమాణాలకు సైతం వారు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారన్నారు. 2022 ఆగస్టులో బీటా సిటోస్టిరాల్‌తో రసాయనాలు కలిశాయని నివేదిక వచ్చిందని చెప్పారు. CFTRI ల్యాబ్ రిపోర్ట్ వస్తే.. దానిని సైతం తొక్కిపెట్టారన్నారు. 2024 జులై 23న NDDB రిపోర్ట్ వచ్చిందని.. అందులోని అంశాలనే భగవంతుడు తనతో చెప్పించాడని సీఎం చంద్రబాబు తెలిపారు.


జంతు కొవ్వు కలిసిందని తాను సొంతంగా చెప్పలేదని స్పష్టం చేశారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సైతం తొలగించారన్నారు. 2019 ఆగస్టులో టెండర్ నిబంధనల్లో సడలింపు చేశారని చెప్పారు. టర్నోవర్, పాల సేకరణ సామర్థ్యాన్ని కూడా తగ్గించారని పేర్కొన్నారు. 2020 జనవరిలో శ్రీ వైష్ణవి ప్లాంట్‌ను తనిఖీ చేసి.. ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారన్నారు. కేజీకి రూ.329 చొప్పున భోలేబాబాకు నెయ్యి సరఫరా ఆర్డర్ ఇచ్చారని పేర్కొన్నారు. 2022 జూన్‌లో ఫతేపూర్‌లోని భోలేబాబా ప్లాంట్‌ తనిఖీ చేసి.. డబ్బులు ఇవ్వలేదని ఆ సంస్థపై అనర్హత వేటు వేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక పథకం ప్రకారం తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు కుట్ర చేశారంటూ వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.


తిరుమలకు ఏ మతస్థులైనా రావొచ్చునని.. అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని చెప్పారు. టెండర్ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. నాటి టీటీడీ బోర్డు చైర్మన్ పీఏ చిన్నఅప్పన్న లంచం తీసుకుని దొరికిపోయారని చెప్పారు. ఇవన్నీ నాటి టీటీడీ చైర్మన్, బోర్డుకు తెలిసే జరిగాయని తెలిపారు. నాడు లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందని చాలా ఆరోపణలు వచ్చాయని గర్తు చేశారు. కల్తీ నెయ్యి తయారీకి ముఠాగా ఏర్పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.


నాటి టీటీడీ చైర్మన్ పీఏ చిన్నప్పన్న రూ.4.5 కోట్ల లంచం తీసుకున్నారన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో టెండర్లు దక్కించుకుని రసాయనాల నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. కల్తీ నెయ్యి తయారీకి వివిధ రకాల రసాయనాలు వినియోగించినట్టు దర్యాప్తులో తేలిందని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం

మద్యం స్కాంలో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

For More AP News And Latest News

Updated Date - Feb 24 , 2026 | 02:39 PM