రోజువారీ విద్యుత్ డిమాండ్ 290 మిలియన్ యూనిట్లు దాటి పోతోంది: మంత్రి గొట్టిపాటి..
ABN , Publish Date - Sep 09 , 2026 | 09:47 PM
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే విషయంలో రాజీపడే ప్రశస్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీలో ఎండలు వేసవిని తలపిస్తూ విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని అన్నారు. ఏపీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే విషయంలో రాజీపడే ప్రశస్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయని, దీంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని ఆయన అన్నారు. ప్రజల అవసరాలు, డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి పరిస్థితులు, ప్లాంట్ల పనితీరు, సరఫరా వ్యవస్థపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 290 మిలియన్ యూనిట్లు దాటి పోతోందని మంత్రి తెలిపారు. ఈ మేరకు థర్మల్, హైడల్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనితీరు సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉండేలా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు గొట్టిపాటి సూచించారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బొగ్గు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు లేకుండా సరఫరా సక్రమంగా జరిగేలా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ, డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇరాన్ చేతిలో యూఎస్ అండర్ వాటర్ డ్రోన్!
‘నిజం గెలిచింది’.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ర్యాలీలు