గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఆందోళన పడొద్దు: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:01 PM
ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
అమరావతి: ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఇండియన్ ఎంబసీ(Indian Embassy)లో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరూ నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి కోరారు.
ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, మీడియా ద్వారా సరైన సమాచారం తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతోందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్ధరిస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర పౌరులను మంత్రి కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇస్తున్న ఆదేశాలు, సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరినీ కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్ లైన్ నెంబర్లు +91 8500027678, +91 0863 2340678 నంబర్లకు కాల్ చేయాలని, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే ఫాలో కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?