మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలు.. ఖండించిన ప్రభుత్వం
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:25 PM
మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
అమరావతి, జూన్01: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడుతూ.. 2024 డిసెంబర్‌లోనే ఏపీ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ప్రకటించిందన్నారు. ఈ ఉద్యోగ నియమకాల్లో రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచిందని వివరించారు. 65 క్రీడలకు ఈ స్పోర్ట్స్ కోటా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ 2025లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. అందులో 3 శాతం రిజర్వేషన్‌లో భాగంగా 431 పోస్టులు కేటాయించామని వివరించారు.
3,600 మంది అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని అజయ్ జైన్ చెప్పారు. 5,326 అప్లికేషన్స్ అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని తెలిపారు. 382 మంది మెరిట్ లిస్ట్‌లో రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఇంకా 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 2011 నుంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్‌ను జారీ చేసేది.. ఫెడరేషన్లు, అసోషియేషన్లు, యునివర్సిటీలేనని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గుర్తు చేశారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు.. క్రీడలు శాఖ కానీ.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కానీ జారీ చేయదని స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులు దరఖాస్తు చేసిన అన్ని సర్టిఫికేట్లను క్షణ్ణంగా పరిశీలించామని అజయ్ జైన్ చెప్పారు. దీనిపై ఏపీ హైకోర్టులో 69 కేసులు దాఖలు కాగా.. వాటిలో 3 కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు. ఇంకా 66 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మొత్తం 192 ఫిర్యాదులు అందాయని.. అన్ని డిస్పోజ్ చేశామని వివరించారు. స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థుల ఎంపిక అంతా సక్రమంగానే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించవద్దంటూ దీనిపై ప్రచారం చేసే వారికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేష్
For More AP News And Telugu News