తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:45 PM
తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు.. స్వామి వారిని దర్శించుకుంటారు.
తిరుమల, జూన్01: తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు.. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి ముందుగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ ఏడాది తలనీలాలను భక్తులు రికార్డు స్థాయిలో సమర్పించారు. మే మాసంలో 12,43,063 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు ఇచ్చారు. మే 1 నుంచి మే 27వ తేదీ వరకు శ్రీవారికి మొక్కుల రూపంలో భక్తులు తననీలాలు సమర్పించుకున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. గతంలో ఉన్న రికార్డులను ఇది అధిగమించిందని తెలిపింది.
2024 మే నెలలో 10.65 లక్షల మంది, 2025, మే మాసంలో 10.18 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని గణాంకాలతో సహా టీటీడీ వివరించింది. మే 18 నుంచి 23వ తేదీ వరకు ప్రతి రోజు 50 వేల మంది భక్తులు తలనీలాలు ఇచ్చారని చెప్పింది. అయితే మే 23వ తేదీ ఒక్క రోజే.. 57,580 మంది భక్తులు తమ మొక్కుల కింద తలనీలాలు ఇచ్చారని పేర్కొంది. ఇటీవల కాలంలో అత్యధికంగా తలనీలాలు సమర్పించినది మే 23వ తేదీ అని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమలలో కళ్యాణకట్టతోపాటు 11 తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేశామని టీటీడీ వివరించింది. తలనీలాల కోసం 1,150 మంది మంగలి వారిని ఏర్పాటు చేశామంది. వారిలో 269 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పింది.
మొక్కుల రూపంలో భక్తులు ఇచ్చిన తలనీలాలను విదేశాలు.. చైనా, ఇటలీ, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తామని టీటీడీ పేర్కొంది. అలాగే ఇటీవల కాలంలో తలనీలాలను వేలంపాటు వేయడం ద్వారా వస్తున్న ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. తలనీలాల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 67 కోట్లు వచ్చిందని వివరించింది. ఇలా ప్రతి ఏడాది తలనీలాల ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తలనీలాల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది. వేసవి సెలవులతోపాటు వారాంతం సెలవుల కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది. స్వామివారికి హుండీ, విరాళాలతోపాటు తలనీలాల రూపంలో కూడా ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని భక్తుల సేవకు టీటీడీ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.