Share News

మెగా డీఎస్సీ‌పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

ABN , Publish Date - May 26 , 2026 | 09:40 PM

మెగా డీఎస్సీ-2025 పరీక్ష నిర్వహణపై తీవ్ర దుష్ప్రచారం జరుగుతున్న వేళ.. పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాజధాని అమరావతిలో స్పందించింది. ఈ మెగా డీఎస్సీ 2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది.

మెగా డీఎస్సీ‌పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

అమరావతి, మే 26: మెగా డీఎస్సీ-2025 పరీక్ష నిర్వహణపై తీవ్ర దుష్ప్రచారం జరుగుతున్న వేళ.. పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాజధాని అమరావతిలో స్పందించింది. ఈ మెగా డీఎస్సీ 2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. మెగా డీఎస్సీలో15,941 పోస్టుల భర్తీ 100 శాతం పారదర్శకంగా జరిగిందని వివరించింది. నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం నోటీసులు పంపడమే కాకుండా.. వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేసింది. ఈ నియామక ప్రక్రియ అంతా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, నోటిఫై చేసిన నియామక నిబంధనలతోపాటు రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగానే జరిగిందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.


ప్రతి దశలోనూ పారదర్శకత, డిజిటల్ భద్రతా, ఫిర్యాదుల పరిష్కార (Grievance Redressal) విధానాలు, జిల్లా స్థాయి ధృవీకరణ (Verification) వ్యవస్థలను పటిష్టంగా అమలు చేయడం జరిగిందని సోదాహరణగా పాఠశాల విద్యాశాఖ వివరించింది. అయితే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా వేదికలతోపాటు కొందరు వ్యక్తులు కావాలనే మెగా డీఎస్సీ-2025పై నిరాధారమైన ప్రచారాన్ని సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నోటిఫైడ్ రిజర్వేషన్ విధానాలు.. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ (Horizontal Reservation) అమలు తీరును కనీసం అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, మెరిట్ జాబితాలు ప్రచురించ లేదని, అక్రమ ఎంపికలు జరిగాయని.. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ వివరించింది.


మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి మెరిట్, ఎంపిక జాబితాలతోపాటు ఇతర అన్ని వివరాలు నోటిఫై చేసిన విధానం ప్రకారమే పారదర్శకంగా ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ వివరించింది. ఎంపిక ప్రక్రియ అంతా కేవలం మెరిట్, రిజర్వేషన్ రోస్టర్, ధృవీకరణ వ్యవస్థల ఆధారంగా, అత్యంత సురక్షితమైన డిజిటల్ విధానంలోనే నిర్వహించామని స్పష్టం చేసింది. ఈ అబద్ధపు ప్రచారాలు అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తించడమే కాకుండా, విద్యాశాఖ ప్రతిష్టతోపాటు నియామక ప్రక్రియ విశ్వసనీయతకు భంగం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది.


తప్పుడు ప్రచారం చేసిన సదరు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలతోపాటు ఇతర బాధ్యులకు పరువు నష్టం (Defamation) నోటీసులు జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. సమాజంలో గందరగోళం సృష్టించినందుకు గానూ బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేసింది. ప్రజలు, అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా నిరాధార ఆరోపణలు చేసిన సంస్థలు, వ్యక్తులు బహిరంగంగా ప్రజలకు, విద్యాశాఖకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విద్యాశాఖ డిమాండ్ చేసింది.


ప్రభుత్వం చేపట్టే అన్ని నియామక ప్రక్రియల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రతిభాఆధారిత (Merit) ఎంపికతోపాటు బాధ్యతాయుతమైన పరిపాలనకు పాఠశాల విద్యాశాఖ నిత్యం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని అభ్యర్థులకు ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీ ఈదురు గాలులు.. నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

సింగరేణిపై కాంగ్రెస్ అక్రమాలు మరిన్ని బయటపెడతా: హరీష్ రావు

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2026 | 10:09 PM