Share News

లిక్కర్ స్కామ్‌లో వేల కోట్ల దోపిడీ.. వైసీపీపై మంత్రి పార్థసారథి ఫైర్

ABN , Publish Date - Aug 24 , 2026 | 08:15 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. మద్యం తయారీ, రవాణా, హోలోగ్రామ్‌ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.

లిక్కర్ స్కామ్‌లో వేల కోట్ల దోపిడీ.. వైసీపీపై మంత్రి పార్థసారథి ఫైర్
Kolusu Parthasarathi

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సుమారు రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. మద్యం పాలసీని మార్చి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. మద్యం తయారీ, రవాణా, హోలోగ్రామ్‌ల వ్యవహారాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించి, వాటిని రహస్య ప్రాంతాల్లో దాచుకున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంటే.. రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు.


కులాలు, మతాల పేరుతో తప్పించుకునే ప్రయత్నం

ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఆర్థిక ప్రయోజనాల కోసమే మద్యం పాలసీని రూపొందించారని విమర్శించారు. చేసిన అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకునేందుకు కులాలు, మతాలను అడ్డుపెట్టుకుంటున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ కసిరెడ్డి వంటి సలహాదారుల సహకారంతో ఈ విధానాన్ని రూపొందించారని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులను మద్యం వ్యవహారంలో పావులుగా ఉపయోగించుకుని, చివరకు వారినే బాధ్యులను చేశారని వ్యాఖ్యానించారు.

విదేశాలకు అక్రమ సొమ్ము తరలింపు.!

మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును విదేశాల్లో మైనింగ్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లోకి మళ్లించారని పార్థసారథి ఆరోపించారు. తమపై కేసులు నమోదైతే కోర్టులపై నమ్మకం లేదంటూ, రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించారని మంత్రి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇరుక్కున్నారని ఆయన పేర్కొన్నారు.

మద్యం రవాణా ఛార్జీల విషయంలోనూ అక్రమాలు జరిగాయని పార్థసారథి ఆరోపించారు. గతంలో రూ.13గా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీని ప్రభుత్వ మద్దతుతో రూ.35కు పెంచుకుని సుమారు రూ.400 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. మద్యం వ్యాపారం, రవాణా కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలను కారుమూరి కుటుంబ సభ్యులే అంగీకరించారని మంత్రి పేర్కొన్నారు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును కుటుంబ సభ్యులు, సంస్థలతో పాటు మహిళల బ్యాంకు ఖాతాల్లోకి కూడా మళ్లించారని ఆరోపించారు.

ఎవరినీ ఉపేక్షించం: మంత్రి పార్థసారథి

లిక్కర్ స్కామ్‌లో స్పష్టమైన ఆధారాలు ఉండటం వల్లే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా కారుమూరి కుటుంబానికి బెయిల్ ఇవ్వలేదని పార్థసారథి పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగించిన వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యం, గౌరవం ఉంటాయని పార్థసారథి అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో మద్యం బ్రాండ్ల వ్యవహారంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి పార్థసారథి కోరారు.


Also Read:

భారత్-శ్రీలంక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

డయాబెటిస్‌ ఉన్నవారు సీతాఫలం తినవచ్చా?

Updated Date - Aug 24 , 2026 | 08:15 PM