ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:56 AM
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్ట్ చిక్కింది. ఈ రిపోర్టులో మాజీ మంత్రి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనే విషయాలను ఈడీ స్పష్టంగా వెల్లడించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్ రిపోర్ట్ చిక్కింది. ఈ రిపోర్టులో మాజీ మంత్రి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనే విషయాలను ఈడీ స్పష్టంగా వెల్లడించింది.
రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని మాజీ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో ఈడీ ఆరోపించింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి ఖాతాలోకి రూ.11.95 కోట్లు వెళ్లినట్టు గుర్తించామని పేర్కొంది. మొత్తం రూ.18.09 కోట్ల మనీలాండరింగ్ జరిగినట్టు వెల్లడించింది. అక్రమ మార్గాల్లో వచ్చిన డబ్బుతో కారుమూరి అప్పులు తీర్చడంతో పాటు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు పేర్కొంది. పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు, ఖరీదైన వాచీలు కొనుగోలు చేసేందుకు, విమాన ఛార్జీలు చెల్లించేందుకూ ఖాతాలోని నగదును కారుమూరి ఉపయోగించినట్టు ఈడీ తెలిపింది.
మరో నిందితుడు రాజ్ కసిరెడ్డికి మాజీ మంత్రి నెలకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చెల్లించినట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. లిక్కర్ రవాణా కేసులో కారుమూరికి మొత్తం 10 నోటీసులు ఇచ్చామని.. అయితే దర్యాప్తును అడ్డుకునేందుకు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగారని ఆరోపించింది. మద్యం రవాణాలో సబ్‌కాంట్రాక్టులు ఇప్పించినందుకు వచ్చే లాభాల్లో 50 శాతం వాటాను కారుమూరి నాగేశ్వరరావు వసూలు చేసినట్టు ఆరోపించింది. ఈ వ్యవహారంలో కొల్లగొట్టిన డబ్బును కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ పేర్కొంది.
సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ పేరిట కారుమూరి సబ్‌కాంట్రాక్ట్ పొందినట్టు ఈడీ తెలిపింది. ఆ కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన ఆదాయంలో 85 శాతం కారుమూరి కుటుంబానికి, 15 శాతం సుదర్శన్ కన్‌స్ట్రక్షన్‌కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ప్రతినిధి సందీప్ ద్వారా ఈ చెల్లింపులు జరిగినట్టు గుర్తించినట్టు తెలిపింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో అక్రమంగా వచ్చిన నిధుల మళ్లింపు, సబ్‌కాంట్రాక్టుల ద్వారా జరిగిన లావాదేవీలు, కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధుల బదిలీ వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ చెప్పుకొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
డిసెంబర్ చివరి నాటికి క్వాంటం వ్యాలీ భవనం పూర్తి: మంత్రి నారాయణ
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు