వైసీపీ ఎంపీపై హైకోర్టు ఫైర్
ABN , Publish Date - Mar 11 , 2026 | 08:08 PM
రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ధర్మాసనం మండిపడింది.
అమరావతి, మార్చి 11: రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ధర్మాసనం మండిపడింది. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ప్రశ్నించింది. అలాగే ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాలు పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా అంటూ సమర్థించింది.
పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్లిపోతాయని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐటీ, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు పాలసీలను రూపొందించి ఉండవచ్చని తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకునేందుకు తాము ఇక్కడ లేమని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అధిక శాతం మంది తెలుగువారే ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. అలాగే రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించింది. దీని వలన కలిగే విస్తృత ప్రయోజనాలు భవిష్యత్తులో చూడవచ్చని పేర్కొంది. వేలంలో కంపెనీలకు భూములు కేటాయించడం వలన ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రభుత్వ పాలసీ వలన పెట్టుబడులు పెట్టలేక పోయామని ఏ కంపెనీ అయిన కోర్టు ముందుకు వచ్చిందా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాలసీని సవాల్ చేస్తూ రాజకీయ నాయకుడు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ప్రభుత్వ విధాన పరమైన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని తెలిపింది. ప్రచారం కోసమో.. మరే ఇతర కారణాలతో ఒకే అంశంపై ప్రజాహిత్యవ్యాజ్యాలు వేస్తున్నారని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ
For More AP News And Telugu News