Share News

ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి.. జీఓ జారీ

ABN , Publish Date - Sep 15 , 2026 | 08:10 PM

రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన 7,85,500 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూములుగా తప్పుగా నమోదు చేసిన.. 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి.. జీఓ జారీ

అమరావతి, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ హక్కులు పొందిన 7,85,500 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూములుగా తప్పుగా నమోదు చేసిన.. 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫ్రీ హోల్డ్ భూములపై కూటమి సర్కార్ మంగళవారం జీఓ జారీ చేసింది. ఫ్రీ హోల్డ్‌కు అర్హత ఉండి ప్రొసిడింగ్స్ కాని.. 64,143 ఎకరాల భూములకు ఉత్తర్వులు లేకుండానే రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పించింది. చుక్కల భూముల చట్టం-2017 కిందకు వచ్చే 17,897 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్ల నిర్వహణకు పచ్చ జెండా ఊపింది.


అసైన్‌మెంట్ జరిగి 20 ఏళ్లు నిండని 28,292 ఎకరాలకు.. సంబంధించి గడువు పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్రీ హోల్డ్ చేసిన 38,733 ఎకరాలు, లబ్ధిదారుల స్వాధీనంలో లేని 25,486 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఉల్లంఘనలు, స్వాధీనం చేయని భూములపై.. ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్లతో సమగ్ర విచారణ చేయాలని ఆదేశించింది. వెబ్‌లాండ్‌లో అసైన్డ్‌గా ఉండి అదనపు ఆధారాలు లేని 2,87,53 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు పరిశీలన కోసం హోల్డ్‌‌లో ఉంచింది.


నీటి వనరులు / జల విభాగాలు కానీ 24,261 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల ఫ్రీ హోల్డ్ హక్కుల మంజూరు అధికారాలను.. ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్డీవో ఉత్తర్వులపై అసంతృప్తి ఉంటే 60 రోజుల్లోగా జాయింట్ కలెక్టర్‌కి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పస్టం చేసింది. ఫ్రీ హోల్డ్ హక్కుల కోసం లబ్ధిదారులు.. గ్రామోద్యోగ/స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు (SGSW) సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

22A అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలి: కేటీఆర్

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

For More AP News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 08:46 PM