Share News

క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యువజన సర్వీసులు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: మంత్రి మండిపల్లి
AP Minister Mandipalli Ramprasad Reddy

అమరావతి, జూన్ 24: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యువజన సర్వీసులు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో తాను నిర్వహిస్తున్న శాఖల్లోని రెండేళ్ల ప్రగతిని విలేకర్ల సమావేశంలో ఆయన వివరించారు. ‘క్రీడా శాఖని అత్యున్నత స్థాయికి కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. క్రీడాకారులకు అన్ని కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. విజయనగరంలో స్టేడియంతోపాటు ఇండోర్ స్పోర్ట్స్ హాల్‌ని రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించాం. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించాం. ఖేలో ఇండియా పథకంతో ప్రభుత్వం క్రీడా మౌలిక వసతులు పూర్తి చేస్తుంది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్స్ అందుబాటులోకి వచ్చాయి’.


‘2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో క్రీడల ప్రోత్సాహానికి భారీగా నిధుల కేటాయింపులు చేశాం. అంతర్జాతీయ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ చేశాం. 399 మంది క్రీడాకారులకు రూ.14.58 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం. 618 మంది క్రీడాకారులకు రూ.7.72 కోట్ల నగదు బహుమతులుగా ఇచ్చాం. 2024-25లో 1,226 మంది, 2025-26లో 615 మంది క్రీడాకారుల.. స్పోర్ట్స్ కోటాలో ప్రయోజనం పొందారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆర్జీయూకేటీ, ఈఏఫీసీఈటీ, ఈసీఈటీ కోర్సుల్లో క్రీడా కోటా అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచాం’.


‘2024-25లో 204 మందికి క్రీడా రిజర్వేషన్‌తో ఉద్యోగాలు పొందారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎస్సీ -2025లో క్రీడాకారులకు ప్రయోజనం కలిగింది. ఫిట్ ఇండియా కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలో క్రీడలకు ఊతం ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 31 క్రీడా విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తు్న్నాం. 2026 నాటికి 1,393 శిక్షణ శిబిరాల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. 49 వేల మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం’.


‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్ సేవల విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. స్పోర్ట్స్ డేటా మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. క్రీడా యాప్, ఆన్‌లైన్ పోర్టల్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. 26 జిల్లాల్లో శాప్ క్రీడా స్టేడియాల నిర్వహణతోపాటు 365 క్రీడా కార్యక్రమాల నిర్వహణ చేపట్టాం’ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు’.


‘ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకి వందలాది మంది టీచర్స్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. మెగా డీఎస్సీలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు అర్ధం పర్ధం లేదు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాద్ధాంతం ఆపాలి. ఇలా చేస్తే టీచర్ ఉద్యోగాలు పొందిన 16 వేల కుటుంబాలను మీరు అవమానించడమే అవుతుంది. ఆడుదాం ఆంధ్రా విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం.. తప్పులను వెలికి తీస్తామన్నారు’.


’దీనికి సంబంధించి ఎంక్వైరీ వేశాం... ఈ వ్యవహారంలో వైసీపీ వాళ్లు ఎక్కవగా స్పందిస్తున్నారు. ఎవరయితే ఈ కేసులో ఉన్నారో వారే భయంతో మాట్లాడుతున్నారు. డీఎస్సీలో 382 పోస్టులు క్రీడాకారులకు ఇచ్చారు. 420 పోస్టులు ఉంటే అర్హత ఉన్న మేరకే పోస్టులు భర్తీ చేశాం. తప్పు జరిగి ఉంటే మొత్తం పోస్టులు భర్తీ అయ్యేవని’ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పూర్తి కావొచ్చిన మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు.. త్వరలో నిందితులపై చర్యలు: మంత్రి అనగాని

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

For More AP News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 01:02 PM