Share News

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ABN , Publish Date - Aug 05 , 2026 | 08:56 PM

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగంగా ఉన్న వేలాది ఎకరాల భూముల వేలం ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
Nandendla Manohar

అమరావతి: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్య పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ అంశంపై ఇప్పటివరకు మూడు సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నిజమైన బాధితులని మంత్రి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 వేల ఎకరాల భూమి ఉందని, అందులో 6 వేల ఎకరాలకు పైగా భూమిని వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరగా ఆక్షన్ ప్రక్రియ ప్రారంభించాలని సీఐడీ అధికారులను కోరినట్లు వెల్లడించారు. గత సమావేశంలో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన చర ఆస్తుల విషయంలో పోలీసు శాఖకు అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.


రూ.6 వేల కోట్ల డిపాజిట్లు

అగ్రిగోల్డ్‌లో సుమారు 5 లక్షల మంది ఏజెంట్లు పనిచేశారని, ప్రజల నుంచి దాదాపు రూ.6 వేల కోట్ల డిపాజిట్లు సేకరించారని మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు రూ.3 వేల కోట్లు సేకరించినట్లు చెప్పారు. మొత్తం 18 లక్షల 57 వేల 290 మంది పేర్లతో ప్లాట్లు ఇస్తామని చెప్పి డిపాజిట్లు తీసుకున్నట్లు వివరించారు. ఈ వ్యవహారంపై లోతైన పరిశీలన జరిపి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు

అగ్రిగోల్డ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే తొమ్మిది రాష్ట్రాల నుంచి ఏజెంట్లు వచ్చి డిపాజిట్లు సేకరించారని, ఆయా రాష్ట్రాల్లో బాండ్ల స్వీకరణ కోసం పోలీసు శాఖతో కలిసి ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

స్పెషల్ కోర్టు ఏర్పాటుకు చర్యలు

ఆగస్టు 11న సీఎస్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 15లోపు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆస్తుల వేలానికి సంబంధించిన విధివిధానాలను కూడా త్వరలో ఖరారు చేస్తామని, దశలవారీగా అన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.


Also Read:

కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి వచ్చి.. బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడి అరెస్ట్

కాలేయాన్ని కాపాడే సహజ మార్గాలు ఇవే.!

Updated Date - Aug 05 , 2026 | 08:56 PM