ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:31 PM
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని మీకు ఆర్థిక సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చురకలంటించారు.
అమరావతి, నవంబర్18: డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని మీకు ఆర్థిక సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చురకలంటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఏ త్రైమాసికంలో విడుదల చేశామన్నది వేరు.. ఆ నిధులు ఏ విద్యా సంవత్సరపు బకాయిలకు చెల్లించామన్నది వేరని వివరించారు. ఇది కూడా తెలుసుకోలేని వైఎస్ జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిల కోసం సుమారు రూ.3,000 కోట్లు విడుదల చేశామని అసెంబ్లీలో చెప్పామని గుర్తు చేశారు. ఆ మాటకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఏ త్రైమాసికంలో ఎంత మొత్తం విడుదల చేశామో పూర్తి వివరాలను జతచేసిన పట్టికలో స్పష్టంగా చూపించామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలు, సవరించిన కేటాయింపులు, వాస్తవ చెల్లింపుల మధ్య తేడా ఉంటుందని తెలిపారు. నిధుల విడుదలకు అనుగుణంగా బడ్జెట్లో సర్దుబాట్లు జరుగుతుంటాయని అన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు ఈ విషయాలు తెలియకపోవడం, తెలుసుకోకపోవడం విచారకరమని చెప్పారు.
మీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎప్పుడూ ఆలస్యంగానే విడుదలయ్యేవని నారా లోకేశ్ గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలోపే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి వచ్చేదని అన్నారు. మేం ఆ పరిస్థితిని మార్చామని తెలిపారు. విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా నేరుగా కళాశాలలకే నిధులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 కోట్ల చొప్పున బకాయిలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని గుర్తు చేశారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వీలైనంత త్వరగా చెల్లించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నారా లోకేశ్ స్పష్టం చేశారు. జగన్ గారూ.. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపండంటూ చురకలంటించారు. మీ రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవద్దని వైసీపీ అధినేతకు మంత్రి నారా లోకేష్ హితవు పలికారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా మంగళవారం ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అందుకు కౌంటర్‌గా నారా లోకేశ్ బుధవారం ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు. రూ.3 వేల కోట్ల లెక్కలను మంత్రి లోకేష్ పట్టిక ద్వారా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మౌనాన్ని బలహీనతగా.. సహనాన్ని భయంగా భావించవద్దు: కోట రుక్మిణి
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి