వైఎస్ జగన్ హయాంలో డెయిరీ రంగం కుదేలు.. లోక్‌సభ వేదికగా కేంద్రం గణాంకాలు వెల్లడి..
ABN , Publish Date - Aug 04 , 2026 | 03:47 PM
వైస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ రంగం కుదేలైనట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాల ఉత్పత్తి తగ్గడం, తలసరి పాల లభ్యత క్షీణించడం వంటి అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని వివరించింది.
న్యూఢిల్లీ: వైస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ రంగం కుదేలైనట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఏపీలో డెయిరీ రంగం పడిపోయిన తీరును స్పష్టం చేశాయి. వైసీపీ హయాంలో పాల ఉత్పత్తి తగ్గడం, తలసరి పాల లభ్యత క్షీణించడం వంటి అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని వివరించింది.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పాల ఉత్పత్తి 15.45 మిలియన్ టన్నుల నుంచి 13.95 మిలియన్ టన్నులకు పడిపోయిందని కేంద్రం తెలిపింది. ఒకే సంవత్సరంలో దాదాపు 10 శాతం మేర పాల ఉత్పత్తి తగ్గినట్లు వెల్లడించింది. అదే సమయంలో రోజువారీ తలసరి పాల లభ్యతా 799 గ్రాముల నుంచి 716 గ్రాములకు తగ్గిపోయినట్లు పేర్కొంది. ఈ గణాంకాలు జగన్ హయాంలో పాడిపరిశ్రమ ఎదుర్కొన్న సంక్షోభానికి అద్దంపడుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డెయిరీ రంగానికి కేంద్రం భారీ స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నట్లు లోక్‌సభలో వెల్లడైంది. ముఖ్యంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్ (NPDD పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.115.65 కోట్లను మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. గతంలో ఇదే పథకం కింద కేవలం రూ.6 కోట్లే కేటాయించగా.. ప్రస్తుతం ఆ మొత్తాన్ని దాదాపు 19 రెట్లు పెంచడం గమనార్హం.
అంతేకాకుండా పశుసంవర్ధక మౌలిక వసతుల అభివృద్ధి నిధి (AHIDF) కింద కూడా ఏపీకి కేటాయింపులు పెరిగాయి. ఈ పథకం ద్వారా రూ.6.57 కోట్ల నిధులను అందించినట్లు కేంద్రం వెల్లడించింది. మరోవైపు పశువుల్లో వ్యాధుల నివారణ, ఉచిత టీకాల కార్యక్రమాల అమలు కోసం రూ.75.96 కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని పేర్కొంది. రైతుల ఆదాయం పెంచడంతో పాటు పాల ఉత్పత్తినీ గణనీయంగా పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాలు అమలులో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
మెగా డీఎస్సీ పిల్.. జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరణ
జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్