ఏపీ కేబినెట్ భేటీలో రైతులకు శుభవార్త.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్!
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:57 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10.30 గంటలకు రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఈ భేటీ జరుగుతుంది.
అమరావతి, జులై 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10.30 గంటలకు రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఈ భేటీ జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఈ కేబినెట్ సమావేశంలో శుభవార్త చెప్పనున్నారు. రాజధానికి కొత్తగా భూములిచ్చే వారికి నాన్ జరీబుకు ఎకరానికి ఏడాదికి రూ.40 వేల యాన్యుటీ ఇచ్చేందుకు ఈ కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. జరీబుకు ఎకరానికి రూ.60,000 ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ట్రంక్ రోడ్ల నిర్మాణంలో భూములు, ఇల్లు కోల్పోయిన వారికి నెలకు రూ.10 వేల అద్దె భత్యానికి కూడా ఆమోదం తెలపనున్నారు.
ఇక కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం ఆ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీఆర్డీఏకి కేబినెట్‌లో అనుమతి ఇవ్వనున్నారు. అమరావతిలో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియంతోపాటు కార్యాలయం నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలపనున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు మొత్తం 7.42 ఎకరాలు కేటాయింపునకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఈషా ఫౌండేషన్‌కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు అప్పగించే నిర్ణయానికి కూడా ఆమోదం తెలపనున్నారు. సీఐఐకు నాలుగు ఎకరాల భూమి కేటాయిస్తూ సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి ఈ కేబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 19వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టుల పెట్టుబడులకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఈ కేబినెట్ భేటీలో రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాల కల్పనపై చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి..
మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్
ఫైవ్‌స్టార్ హోటళ్లలో బిల్లు చెల్లించకుండా ఉడాయిస్తూ.. చివరకు!
For More AP News And Telugu News