Share News

ఏపీలో పలు జిల్లాలకు రైయిన్ అలర్ట్‌

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలో పలు జిల్లాలకు రైయిన్ అలర్ట్‌
Andhra Pradesh Weather Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపు (మంగళవారం) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వెల్లడించింది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మేఘావృత వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.


శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 66.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అలాగే పెంజెరువులో 42.5 మిల్లీమీటర్లు, సోమలింగపాలెంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, అలాగే భారీ హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున చిన్న పడవలతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.


Also Read:

సాయికృష్ణ కేసులో విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్ అధికారులు

BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి

Updated Date - Jul 20 , 2026 | 06:14 PM