భద్రంగా భూమి
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:19 AM
రెవెన్యూ అధికారులు, సిబ్బంది తామే సమస్యలు సృష్టించి... వాటి పరిష్కారం కోసం ప్రజలను తమ చుట్టూ తిప్పించుకుంటున్న వైనంపై ఈనెల 20న ‘తప్పుచేస్తారు.. తిప్పుకొంటారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
‘నిషేధిత’ కష్టాలకు చెల్లు చీటీ
‘రెవెన్యూ’లో ఏకపక్ష నిర్ణయాలు కుదరవు
హక్కుదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం
నిషేధిత భూములపై పక్కా మార్గదర్శకాలు
వారికి వారుగా రికార్డులు మార్చడం చెల్లదు
ఏ చర్యకైనా ముందస్తు నోటీసు ఇచ్చి తీరాల్సిందే
పౌరుల వాదనలు విన్నాకే తుది నిర్ణయం
అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు
జీవో 445 జారీ చేసిన సర్కారు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అధికారులు, సిబ్బంది తామే సమస్యలు సృష్టించి... వాటి పరిష్కారం కోసం ప్రజలను తమ చుట్టూ తిప్పించుకుంటున్న వైనంపై ఈనెల 20న ‘తప్పుచేస్తారు.. తిప్పుకొంటారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం నిశిత పరిశీలన చేసింది. ఏళ్లతరబడి కొనసాగుతున్న అలసత్వం, నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేస్తూ... భూమి హక్కుదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా 14 పేజీల సమగ్రమైన మార్గదర్శకాలు, విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. బుధవారం రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించిన అంశాలకు తోడు అనేక కొత్త విషయాలను, భూమి హక్కుదారుల రక్షణలను విశదీకరిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం జీఓ 445 జారీ చేశారు. దాని సారాంశమిదీ..
నోటీసు ఇచ్చాకే ఏదైనా...
హక్కుదారుకు, సాగుదారుకు ముందస్తు నోటీసు, సమాచారం లేకుండా ఏ భూమినీ నిషేధ జాబితాలో చేర్చడానికి వీల్లేదు. ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండా రికార్డులు మార్చొద్దు.
నోటీసులను రిజిస్టర్డ్ పోస్టు, డిజిటల్ డెలివరీ (మెయిల్, ఫోన్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్), ఇంకా ఫిజికల్ నోటీసులు పంపాలి. ఈ మూడింటిలో కనీసం రెండు మార్గాల్లో నోటీసు వెళ్లినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే... ఆ భూమికి సంబంధించిన ఫైలు తదుపరి దశ పరిశీలనకు పంపాలి.
22(ఏ)లో ప్రైవేటు పట్టా భూములు ఉంచరాదు.
ప్రతీ ఫైల్‌కు ఒక రాష్ట్ర స్థాయి నంబర్ ఉంటుంది. ఏదైనా భూమిని 22(ఏ)లో చేర్చాలని ఆర్డీఓ ప్రతిపాదించాలంటే, ముందుగా రిజిస్ట్రేషన్ ఐజీ నుంచి రాష్ట్రస్థాయి నంబర్‌తో కూడిన ఫైలును అప్‌లోడ్ చేయాలి. నిషేధ జాబితాలో చేర్చేందుకు గల కారణాలు, సాక్ష్యాలను ఆ ఫైలుకు జత చేయాలి. మొత్తం సర్వే నంబర్‌ను నిషేధ జాబితాలో చేర్చడానికి వీల్లేదు. నిర్దిష్టంగా సబ్‌డివిజన్‌చేసి అవసరం ఉన్న భూమినే నిషేధ జాబితాలో చేర్చాలి.
పౌరులకు రికార్డు సవరణ, లేదా నిషేధ భూమిలో చేర్చే అంశంలో స్పందించేందుకు 30 రోజుల గడువుతో నోటీసు ఇవ్వాలి. ఈలోగా పౌరులు తమ వద్ద ఉన్న ఆధారాలు, రికార్డులతో అధికారి ముందు హాజరై వాదనలు వినిపించుకోవచ్చు. ఆస్తికి సంబంధించి అడంగల్, సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్, పాత అసైన్‌మెంట్ రిజిస్టర్, డీ-ఫారం పట్టా, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్టర్డ్ టైటిల్ డీడ్, రీ సర్వే రికార్డులు, కోర్టు ఉత్తర్వులను ఆధారాలుగా సమర్పించవచ్చు.
పౌరులు విచారణకు హాజరుకాకపోతే, డాక్యుమెంట్లను సరిగ్గా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
ఏదైనా ఆస్తిని 22(ఏ)లో ఉంచితే దాన్ని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకునే హక్కు పౌరులకు ఉంటుంది. విచారణ మొత్తాన్ని రికార్డుచేసి ఇరుపక్షాలు సంతకాలు చేయాలి. విచారణను ఆడియో రికార్డ్‌చేసి భద్రపరచాలి.
విచారణ ముగిసిన 21 రోజుల తర్వాత ఆ భూమిని 22(ఏ)లో ఎందుకు చేర్చాలో ఆధారాలతో సహా చూపుతూ స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి.
భూమిని కాపాడే పేరిట వెనువెంటనే 22(ఏ) జాబితాలో చేర్చాలంటే.. దాన్ని అత్యవసర కోటాలో 60 రోజుల్లోపే పూర్తిచేయాలి. ఈలోపు సంబంధిత వ్యక్తులకు 30 రోజుల గడువుతో నోటీసు ఇవ్వాలి. 60 రోజుల్లోగా అత్యవసర కేటగిరీ కింద ఆ భూమిని నిషేధ జాబితాలో చేర్చకుంటే దాన్ని పట్టా భూమిగానే పరిగణించాల్సి ఉంటుంది.