కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 08 , 2026 | 04:44 PM
ప్రతి శుక్రవారం కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 08: జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం కలెక్టర్లు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ మెమోలో కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు నెలకు నిర్దేశిత రోజులు ఫీల్డ్‌లో గడపాలని స్పష్టం చేసింది. ప్రతి శుక్రవారం కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ప్రత్యేకంగా ఆదేశించింది.
కార్యదర్శులు నెలకు కనీసం 3 రోజులు, శాఖాధిపతులు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మెమోలో పేర్కొన్నారు. ఫీల్డ్ విజిట్‌ను అధికారులు.. ఆర్టీజీఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ సందర్శన తేదీ, గ్రామం/పట్టణం, పరిశీలన వివరాలు, గుర్తించిన సమస్యలు, తీసుకున్న చర్యలు, తదుపరి ఫాలో అప్ వంటి అన్ని వివరాలను అప్‌లోడ్ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అధికారులకు వచ్చిన ఫిర్యాదులను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరించారన్న విషయాన్ని ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ద్వారా ప్రభుత్వం పరిశీలించనుంది. ఈ చర్యతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బుడగ జంగాలకు ఎస్సీ ప్రయోజనాలు.. సీఎం చంద్రబాబు ఆదేశం
మే 12న ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు