బుడగ జంగాలకు ఎస్సీ ప్రయోజనాలు.. సీఎం చంద్రబాబు ఆదేశం
ABN , Publish Date - May 08 , 2026 | 04:36 PM
ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీ, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీలకు కలిగే ప్రతి లబ్ధిని బుడగ జంగాలకు వర్తింప చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, మే 7: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, హౌసింగ్ వంటి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీ, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీలకు కలిగే ప్రతి లబ్ధిని బుడగ జంగాలకు వర్తింప చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరగాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ నాటికల్లా మరో 2.38 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
2 లక్షల మందికి ఇంటి జాగాలు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు సీఎం తెలిపారు. 3 సెంట్లు గ్రామాలు, 2 సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందన్నారు. లబ్ధిదారులు అంగీకరిస్తే.. ప్రస్తుతం ఉన్న వారికి అదే లే అవుట్లల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ, సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఇళ్ల క్రమబద్ధీకరణలో ఏమైనా ఇబ్బందులు వస్తే కేబినెట్‌కు పంపాలని... ఆమోదిస్తామన్నారు. ఇళ్ల క్రమబద్ధీకరణ పూర్తి చేయగలిగితే.. విజయవాడలో 60 వేల మందికి, విశాఖలో 30 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
గుంటూరులో 22ఏ భూముల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్ ఉందని.. దీనిపై కేంద్రంతో మాట్లాడతామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తింప చేసే ప్రతి ప్రయోజనాన్ని బుడ గజంగాలకు వర్తించేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. బీసీ హాస్టళ్లల్లో ఆర్వో యూనిట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని.. హాస్టళ్లకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ముస్లిం జనాభా ఉన్న చోట 175 నియోజకవర్గాల్లోనూ రూరల్ ఆటోనగర్‌లు ఏర్పాటు చేస్తే ఓ పారిశ్రామికవాడ సిద్ధం అవుతుందని అన్నారు. వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఈ పారిశ్రామికవాడలను మైనారిటీల కోసమే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. లైవ్ లీ హుడ్ హబ్‌లుగా వీటిని అభివృద్ధి చేయాలని సూచించారు. జలధార, పశుగ్రాసం సహా వివిధ కార్యక్రమాలను కేంద్ర పథకాలతో ఇంటిగ్రేట్ చేసి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
మే 12న ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు
Read Latest AP News And Telugu News