ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:16 PM
పర్యావరణ దినోత్సవం (జూన్ 5వ తేదీ) సందర్భంగా ప్రతి ఒక్కరు సైకిల్ వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
అమరావతి, జూన్04: పర్యావరణ దినోత్సవం (జూన్ 5వ తేదీ) సందర్భంగా ప్రతి ఒక్కరు సైకిల్ వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్‌పై వెళ్లనున్నారు. పర్యావరణ హితమైన సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, పార్టీ నేతలతోపాటు ప్రభుత్వంలో పని చేసే వారంతా శుక్రవారం సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా గురువారం ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. సైకిల్ యాత్రలో పాల్గొనండి: పల్లా శ్రీనివాస్
ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Read Latest AP News And Telugu News