ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్ విధానానికి ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 23 , 2026 | 08:27 PM
ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త విధానాలు అవలంబించాలని అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థ మరింత ఆధునికంగా మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్‌కు హాజరైన సీఎం చంద్రబాబు, మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు కూడా తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నేరాల తీరు పూర్తిగా మారిపోయిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిపై పోలీసులు అప్రమత్తంగా ఉండి వేగంగా స్పందించాలని సూచించారు.
ఆధునిక పోలీసింగ్‌కు ప్రాధాన్యం
పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని, సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. 'ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్' విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేలా పోలీసింగ్ ఉండాలని చెప్పారు. నేరాలను అరికట్టడమే కాకుండా, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చేయగలిగితే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు.
దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి
ప్రభుత్వంపై బురదజల్లేందుకు కొన్ని రాజకీయ పార్టీలు నేరాలకు కూడా వెనుకాడటం లేదని చంద్రబాబు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ ఘటనలో జరిగిన దుష్ప్రచారాన్ని పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. గంజాయి మత్తులో జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని సమర్థంగా నియంత్రించామని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
Also Read:
కోర్టులో ఎమ్మెల్సీ అనంత బాబుకు మరో ఎదురు దెబ్బ
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్